అమెరికాలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్య

అమెరికాలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది హత్య

అమెరికాలోని వాషింగ్టన్‌లో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది దారుణ హత్యకు గురయ్యారు. వాషింగ్టన్‌ డిసిలోని యూదు మ్యూజియంలో జరిగిన కార్యక్రమానికి హాజరై వెళ్తున్న ఇద్దరు ఇజ్రాయెల్ సిబ్బందిపై ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడని అధికారులు వెల్లడించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు నిందితుడిని అరెస్టు చేయగా పాలస్తీనాకు అనుకూలంగా నినాదాలు చేసినట్లు చెప్పారు. నిందితుడిని చికాగోకు చెందిన 30 ఏళ్ల ఎలియాస్ రోడ్రిగ్జ్ గుర్తించారు.

ఈ ఘటనలో ఇద్దరు ఇజ్రాయెల్ సిబ్బంది మరణించినట్టు హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ కార్యదర్శి క్రిస్టి నోయెమ్ ఎక్స్‌ మాధ్యమంలో తెలిపారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్నట్టు చెప్పారు. గాజాలో ఇజ్రాయెల్ మరోసారి దాడుల తీవ్రతరం చేసిన క్రమంలో ఈ ఘటన జరిగింది. అమెరికాలో తమ సిబ్బందికి భద్రత కల్పిస్తారని అమెరికాలోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం ప్రతినిధి తాల్ నయీమ్ ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఎఫ్ బి ఐ వాషింగ్టన్ ఫీల్డ్ ఆఫీస్‌కు కొన్ని అడుగుల దూరంలోనే కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటనను ఇజ్రాయెల్ యూఎన్‌ రాయబారి డానీ డానన్‌ తీవ్రంగా ఖండించారు. దాడికి పాల్పడిన వారిపై అమెరికా అధికారులు చర్యలు తీసుకుంటారని తాము విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనను యూదు వ్యతిరేక ఉగ్రవాదంగా ఐరాస ఇజ్రాయెల్ రాయబారి డానీ డానన్ అభివర్ణించారు.

మరోవైపు ఈ ఘటనపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ సంతాపం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఇలాంటి దాడులకు మగింపు పలకాలన్న ఆయన, జాతి వ్యతిరేకతకు అమెరికాలో తావు లేదని స్పష్టం చేశారు. ఈ భయంకరమైన హత్యలు మరీ ముఖ్యంగా యూదులకు వ్యతిరేకంగా జరిగే ఈ తరహా హత్యలు వెంటనే ఆగిపోవాలని తేల్చి చెప్పారు. 

ద్వేషం, అతివాదానికి అమెరికాలో స్థానం లేదని హెచ్చరించారు. ఇలాంటి ఘటన జరగడం అత్యంత విచారకరం అంటూ బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని సామాజిక మాధ్యమాల వేదికగా ట్రంప్ పోస్ట్ చేశారు.

“వాషింగ్టన్ డీసీలో ఇద్దరు ఇజ్రాయెల్ ఎంబసీ సిబ్బంది అమానవీయ రీతిలో హత్యకు గురయ్యారు. ఈ ఘటనపై ముమ్మర దర్యాప్తు చేపట్టాం. నిందితులను చట్టం ముందు నిలబెడతాం” అని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ క్రిస్టి నోయెమ్‌ తన పోస్టులో చెప్పారు. అయితే, మృతుల వివరాలను ప్రస్తుతం బయటకు వెల్లడించలేదు. అలాగే కాల్పుల సమయంలో ఇజ్రాయెల్ రాయబారి అక్కడ లేరని సమచారం.