వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!

వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులు ఉంటారు!
* వక్ఫ్‌ అంటే కేవలం దాతృత్వం.. ఇస్లాంలో ముఖ్యం కాదు!
 
వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులు వుంటారని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. వైవిధ్యతను పెంపొందించడం కోసమే వక్ఫ్‌ బోర్డుల్లో ముస్లిమేతరులను చేరుస్తున్నామని, ఈ వక్ఫ్‌ బోర్డులు లౌకిక విధులను నిర్వహిస్తాయని, అందువల్ల ముస్లిమేతరులతో సహా ఎవరి పనితీరు ప్రభావితం కాదని పేర్కొంది.  వక్ఫ్‌ బోర్డులలో ముస్లిమేతరులను చేర్చడాన్ని అనుమతిస్తామని, అది కూడా ఇద్దరికే పరిమితం చేశామని స్పష్టం చేసింది. దీనివల్ల వక్ఫ్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఇస్లామిక్‌ స్వభావం విషయంలో రాజీ పడకుండా సమతూకంతో కూడిన పారదర్శక పాలనకు హామీ కల్పించబడుతుందని కేంద్రం పేర్కొంది.
ఈ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై బుధవారం కూడా విచారణ కొనసాగింది.  ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బి.ఆర్‌ గవారు, జస్టిస్‌ అగస్టిన్‌ జార్జ్‌ మాసిలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా కేంద్రం తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా వాదనలు వినిపించారు.  వక్ఫ్‌ అంటే కేవలం దాతృత్వం మాత్రమేనని, ఇస్లాంలో వక్ఫ్‌ ముఖ్యమైన పాత్ర కాదని తెలిపారు. వక్ఫ్‌ బోర్డులు కేవలం లౌకిక విధులు నిర్వహిస్తాయని స్పష్టం చేశారు. 
 
మతపరమైన విధులు నిర్వహించే ఆలయ పాలనకు ముస్లింలకు సబంధించిన వక్ఫ్‌కు పోలిక లేదని తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు విన్నవించారు. వక్ఫ్‌ ఓ ఇస్లామిక్‌ భావన. అయితే అది ఇస్లాంలో ముఖ్యమైన భాగం కాదు. వక్ఫ్‌ కేవలం ఇస్లాంలో ఓ దానం మాత్రమే.  దానం అనేది అన్ని మతాలలో భాగమని గత తీర్పులు చెబుతున్నాయి. అది క్రైస్తవంలో కూడా ఉంటుంది. హిందువులలో కూడా దానం అనే విధానం ఉంది. సిక్కులకు కూడా ఉంది అని మెహతా వాదించారు.
వివాదాస్పద వక్ఫ్‌ బై యూజర్‌ సూత్రం కింద వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునే అధికారం కేంద్రానికి ఉందని మెహతా వాదించారు.  ప్రభుత్వ భూమిపై ఎవరికీ హక్కుండదని తేల్చిచెప్పింది. సర్కారీ భూములు, వక్ఫ్‌గా ప్రకటించిన ఆస్తులను సంరక్షించే అధికారం ప్రభుత్వానికి ఉందని సుప్రీంకోర్టు సైతం తీర్పు ఇచ్చిందని మెహతా తెలిపారు.

కొత్త చట్టంలో తొలగించిన వక్ఫ్‌ బై యూజర్‌ నిబంధన ప్రకారం ఎటువంటి ధ్రువీకరణ పత్రాలు లేనప్పటికీ సుదీర్ఘ కాలం మతపరమైన, దాతృత్వ కార్యక్రమాల కోసం ఉపయోగించే ఆస్తుని వక్ఫ్‌గా పరిగణించాల్సి ఉంటుంది. వక్ఫ్‌ బై యూజర్‌ ప్రాథమిక హక్కు కాదని తుషార్‌ మెహతా స్పష్టం చేశారు.  బ్రిటిష్‌ ప్రభుత్వం, ఆ తర్వాత వచ్చిన భారత ప్రభుత్వాలు పరిష్కరించలేని సమస్యలను కూడా వక్ఫ్‌ చట్టం తీసుకువచ్చిన సవరణలు పరిష్కరించాయని ధర్మాసనానికి మెహతా తెలిపారు.

“1923 నుంచి ఉన్న ఈ భయానక సమస్యను మేం పరిష్కరిస్తున్నాం. చట్టం చేసే ముందు రాష్ట్ర ప్రభుత్వాలను, రాష్ట్రాల వక్ఫ్‌ బోర్డులను సంప్రదించాం. జేపీసీ వేశాం. ప్రతి భాగస్వామితోనూ చర్చించాం. కొద్ది మంది పిటిషనర్లు వచ్చి మొత్తం ముస్లిం వర్గానికి మేం ప్రాతినిధ్యం వహిస్తున్నామని అనలేరు”  అని వ్యాఖ్యానించారు.  వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ, ఆర్థిక లావాదేవీలు వక్ఫ్‌బోర్డు విధులని, ఇవి పూర్తిగా లౌకిక కర్తవ్యాలని, ఇద్దరు ముస్లిమేతర సభ్యులు ఉన్నంత మాత్రాన దాని స్వభావం మారదని పేర్కొన్నారు. వారు మైనారిటీగానే ఉంటారని తెలిపారు.

”హిందూ ఎండోమెంట్‌ బోర్డులు మతపరమైన కార్యకలాపాలను మాత్రమే నిర్వహిస్తాయని, వక్ఫ్‌ బోర్డు లౌకిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది.” అని చెప్పారు. ఇస్లాంకి సంబంధించిన ఎలాంటి మతపరమైన అంశాల విషయంలో వక్ఫ్‌ చట్టం – 2025 జోక్యం చేసుకోదని, కేవలం ముతవాలీ (వక్ఫ్‌ ఆస్తుల మేనేజర్‌) గురించే మాట్లాడుతోందని తెలిపారు. 
 
ముతవాలీలను ఎవరు నియమిస్తారని సిజెఐ ప్రశ్నించగా, వక్ఫ్‌ బోర్డేనని చెప్పారు. అయన ముస్లిమేతరుడు అయి వుండవచ్చా? అనగా వుండవచ్చునని, ఆయనకు ఎలాంటి మత పరమైన కార్యకలాపాలు వుండవని పేర్కొన్నారు.