ప్రముఖ అణుశాస్త్ర‌వేత్త ఎంఆర్ శ్రీనివాస‌న్ క‌న్నుమూత‌

ప్రముఖ అణుశాస్త్ర‌వేత్త ఎంఆర్ శ్రీనివాస‌న్ క‌న్నుమూత‌

అణు శాస్త్ర‌వేత్త‌, అటామిక్ ఎన‌ర్జీ క‌మీష‌న్ మాజీ చైర్మెన్ మాలూరు రామ‌స్వామి శ్రీనివాస‌న్‌ (95) మంగళవారం క‌న్నుమూశారు. ఆయ‌న‌కు భార్య‌, కుమార్తె ఉన్నారు. స్వ‌దేశీ అణ్వాయుధ కార్యక్ర‌మ రూప‌క‌ల్ప‌న‌లో డాక్ట‌ర్ హోమీ బాబాతో క‌లిసి శ్రీనివాస‌న్ ప‌నిచేశారు. ప్ర‌తిష్టాత్మ‌క ప‌ద్మ విభూష‌న్ పౌర పుర‌స్కారాన్ని ఆయ‌న అందుకున్నారు.  ఎంఆర్ శ్రీనివాస‌న్ బెంగుళూరులో జ‌న‌వ‌రి 5, 1930లో జ‌న్మించారు. సైన్స్ స‌బ్జెక్టులో మైసూరు నుంచి ఇంట‌ర్ చ‌దివారు. సంస్కృతం, ఇంగ్లీష్ భాష‌ల‌ను ఎంచుకున్నారు.

ఫిజిక్స్ ఆయ‌న‌కు ఇష్ట‌మైన స‌బ్జెక్ట్‌. 1950లో మెకానిక‌ల్ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. ఎం.విశ్వేశ్వ‌ర‌య్య కూడా ఈయ‌న‌తోనే క‌లిసి చ‌దివారు. 1952లో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేశారు.  కెన‌డాలోని మాంట్రియ‌ల్‌లో ఉన్న మెక్‌గిల్ యూనివ‌ర్సిటీ నుంచి ఎంఫిల్ పూర్తి చేశారు. గ్యాస్ ట‌ర్బైన్ టెక్నాల‌జీలో స్పెష‌లైజేష‌న్ చేశాడు. 1955లో ఆయ‌న డీఏఈలో చేరాడు. తొలి అటామిక్ ప‌వ‌ర్ స్టేష‌న్ నిర్మాణానికి 1959 ఆగ‌స్టులో డాక్ట‌ర్ శ్రీనివాస్‌ను ప్రిన్సిప‌ల్ ప్రాజెక్టు ఇంజినీర్‌గా నియ‌మించారు.

దేశ అణ్వాయుధ కార్య‌క్ర‌మాల రూప‌క‌ల్ప‌న అత‌ని నాయ‌క‌త్వంలో సాగింది.  మ‌ద్రాస్ అటామిక్ ప‌వ‌ర్ స్టేష‌న్‌కు 1967లో చీఫ్ ప్రాజెక్టు ఇంజినీర్‌గా చేరారు. ప‌వ‌ర్ ప్రాజెక్ట్స్ ఇంజినీరింగ్ డివిజ‌న్, డీఏఈకి 1974లో ఆయ‌న డైరెక్ట‌ర్ అయ్యారు. 1984లో న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ బోర్డు చైర్మెన్ అయ్యారు. దేశ‌వ్యాప్తంగా నెల‌కొల్పిన న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ ప్రాజెక్టుల ప్లానింగ్‌, ఆప‌రేష‌న్స్‌ అన్నీ చూసుకున్నారు.

1987లో అటామిక్ ఎన‌ర్జీ క‌మీష‌న్ చైర్మెన్‌గా, అణు ఇంధ‌న శాఖ కార్య‌ద‌ర్శిగా నియ‌మితుడ‌య్యారు. ఆయ‌న నాయ‌క‌త్వంలోనే దేశంలో 18 న్యూక్లియ‌ర్ ప‌వ‌ర్ యూనిట్ల‌ను అభివృద్ధి చేశారు. ఏడు ప్లాంట్లు ఆప‌రేష‌న్‌లో ఉన్నాయి. ఏడు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. మ‌రో నాలుగు ప్లానింగ్ స్టేజ్‌లో ఉన్నాయి. డాక్ట‌ర్ శ్రీనివాస‌న్‌కు 1984లో ప‌ద్మ‌శ్రీ, 1990లో పద్మ‌భూష‌ణ్‌, 2015లో ప‌ద్మ విభూష‌ణ్ అందుకున్నారు.

వియ‌న్నాలోని ఇంట‌ర్నేష‌న‌ల్ అటామిక్ ఎన‌ర్జీ ఏజెన్సీకి 1990 నుంచి 1992 వ‌ర‌కు సీనియ‌ర్ అడ్వైజ‌ర్‌గా ఉన్నారు. 1996 నుంచి 1998 వ‌ర‌కు భార‌త ప్ర‌భుత్వ ప్లానింగ్ క‌మీష‌న్ స‌భ్యుడిగా ఉన్నారు. 2002 నుంచి 2004 వ‌ర‌కు నేష‌న‌ల్ సెక్యూర్టీ అడ్వైజ‌రీ బోర్డు స‌భ్యుడిగా ఉన్నారు.