టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చిన జగన్

టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చిన  జగన్
జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని పాలక మండలి సభ్యుడు, బీజేపీ నేత భాను ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. టీటీడీని ధనార్జన క్షేత్రంగా మార్చి స్వామి వారి ఖజానాకు తూట్లు పొడిచారంటూ గత ప్రభుత్వ పాలకులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

తిరుమల శ్రీవారి ఆలయంలోని తులాభారం నగదును అక్కడ సిబ్బంది తస్కరించారని ఆయన ఆరోపించారు. వాటిపై విచారణ చేపట్టి కేసు నమోదు చేయాలని విజిలెన్స్ ఎస్పీని కోరినట్లు ఆయన తెలిపారు. అందుకు సంబంధించి  తన వద్దనున్న ఆధారాలను ఎస్పీకి సైతం అందజేసినట్లు చెప్పారు. 2019 నుంచి 2024 వరకు విచారణ చేపట్టాలని జిల్లా ఎస్పీని కోరినట్లు ఆయన పేర్కొన్నారు.

గతంలోని ఉన్నతాధికారులు, విజిలెన్స్ సిబ్బందిని సైతం విచారించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. పరకామణి దొంగతనం, కల్తీ నెయ్యి వ్యవహారంతోపాటు తాజాగా తులాభారంలో భక్తులు సమర్పించిన కానుకలను సైతం దొంగిలించారని ఆయన విమర్శించారు. తులాభారంపై జరిగిన అక్రమాలను అప్పటి విజిలెన్స్ అధికారులు బయటపెట్టినా నాటి ఉన్నతాధికారులు వాటిని బుట్ట దాఖలా చేశారని గుర్తు చేశారు.

భక్తులు సమర్పించిన కానుకలను సగం లెక్క చూపి, సగం దొంగతనంగా తీసుకెళ్లారని భానుప్రకాష్ రెడ్డి ఆరోపించారు. పరకామణిలో దొంగతనం చేసిన ఉద్యోగిని చెట్టు కింద పంచాయతీ చేసినట్లు చేసి బేషరతుగా విడిచిపెట్టారని ఆయన వివరించారు. అదేవిధంగా తులాభారంలో దొరికిన దొంగలపై కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టారని చెప్పారు. ఈ తరహా సంఘటనలు చూస్తుంటే శ్రీవారి ఆభరణాలను సైతం దొంగలించారేమోననే అనుమానం కలుగుతుందని ఆయన చెప్పారు.

వీటన్నింటిపై సమగ్ర విచారణ చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం జరగనున్న పాలకమండలి సమావేశంలో సైతం ఈ అంశాన్ని చర్చిస్తానని భాను ప్రకాశ్ రెడ్డి స్పష్టం చేశారు.