జాయ్‌ జమీమా హనీట్రాప్‌ కీలక సూత్రధారి అరెస్ట్

జాయ్‌ జమీమా హనీట్రాప్‌ కీలక సూత్రధారి అరెస్ట్

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తించిన జాయ్‌ జమీమా హనీట్రాప్‌ (వలపు వల) కేసులో కీలక నిందితుడైన స్థానిక ఐటీసీ ట్రేడింగ్‌ కంపెనీ సీఈవో రత్నరాజు (46)ను భీమిలి పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తన అందచందాలు, మాయమాటలతో పలువురు వ్యక్తులను బుట్టలో వేసుకుని, ఆపై వారి నుంచి భారీగా డబ్బు వసూళ్లకు పాల్పడిన జాయ్‌ జమీమా అనే మహిళను హైదరాబాద్‌కు చెందిన ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు ఆరు నెలల కిందట విశాఖలో అరెస్ట్ చేశారు. 

అప్పట్లో ఆమెతో పాటు ఆ ముఠాలో ప్రధాన వ్యక్తులైన బచ్చు వేణుభాస్కర్‌రెడ్డి, అవినాశ్‌ బెంజిమన్‌లనూ అరెస్టు చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంపై మరింత లోతుగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఇందులో రత్న రాజు పాత్ర ప్రధానంగా ఉన్నట్లు గుర్తించారు. రత్నరాజుకు, జాయ్‌ జమీమాకు మధ్య జరిగిన ఆర్థిక లావాదేవీల వివరాలను ఆధారాలతో సహా సేకరించామని అధికారులు తెలిపారు. 

ఇన్నాళ్లుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్న రత్నరాజును భీమిలి సీఐ తిరుమలరావు నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక బృందం విశాఖ విమానాశ్రయం వద్ద తాజాగా అదుపులోకి తీసుకుని, భీమిలి స్టేషన్‌కు తరలించింది. అనంతరం కోర్టు రిమాండ్‌ విధించడంతో అడివివరంలోని కేంద్ర కారాగారానికి తరలించారు.  ఈ ముఠా చేతిలో మోసపోయిన వారిలో కొందరు ప్రముఖులూ ఉన్నారని, వివిధ స్టేషన్లలో నమోదైన కేసుల ఆధారంగా దర్యాప్తు వేగవంతం చేయడానికి నగర పోలీసు కమిషనర్‌ శంఖబ్రత బాగ్చీ ప్రత్యేక బృందాలను నియమించారని సీఐ వెల్లడించారు.