ట్యాంక్‌బండ్‌పై ఘనంగా తిరంగా ర్యాలీ

ట్యాంక్‌బండ్‌పై ఘనంగా తిరంగా ర్యాలీ
పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ ద్వారా భారత సైనిక సత్తా ప్రపంచానికి తెలిసి వచ్చిందని ట్యాంక్‌బండ్‌పై నిర్వహించిన తిరంగా ర్యాలీలో వక్తలు చెప్పారు. పాక్‌ ఎయిర్‌ బేస్‌లపై బ్రహ్మోస్‌ క్షిపణుల వర్షంతో భీతిల్లిన పాక్‌ మూడు రోజుల్లోనే కాళ్లబేరానికి వచ్చిందని తెలిపారు. కాల్పుల విరమణకు ఒప్పుకోవడం ద్వారా యుద్ధాన్ని నివారిస్తూ ప్రధాని మోదీ కీలకంగా వ్యవహరించారని నేతలు కీర్తించారు.
 
ఆపరేషన్‌ సిందూర్‌ విజయవంతమైన సందర్భంగా సైనికులకు సంఘీభావంగా సిటిజన్స్‌ ఫర్‌ నేషనల్‌ సెక్యూరిటీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం లోయర్‌ ట్యాంక్‌బండ్‌లోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ట్యాంక్‌ బండ్‌ మీదుగా చిల్ట్రన్‌ పార్కువద్ద ఉన్న యుద్ధ ట్యాంకు వరకు వేలాదిమందితో తిరంగా ర్యాలీ నిర్వహించారు. వేలాది మంది జాతీయ జెండాలు చేతబూని జై జవాన్‌, జై కిసాన్‌, వందేమాతరం, భారత్‌ మాతాకి జై నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. 
 
మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడుతో పాటు మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సీహెచ్‌ విద్యాసాగర్‌ రావు, కేంద్ర మంత్రి జి.కిషన్‌ రెడ్డి, బిజెపి ఎంపీలు డీకే అరుణ, ఈటెల రాజేందర్, రఘునందన్ రావు, రక్షణశాఖ మాజీ సలహాదారు సతీశ్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో వెంకయ్యనాయుడు మాట్లాడుతూ పాకిస్థాన్‌తో చర్చలు జరిగితే పీఓకే విలీనంపైనే జరుగుతాయని, ఈ విషయంలో అమెరికా, చైనా తదితర దేశాల జోక్యం అవసరం లేదని, సమస్యను పరిష్కరించుకునే సత్తా భారత్‌కు ఉందని స్పష్టం చేశారు. 
 
ఆపరేషన్‌ సిందూర్‌లో విరోచిత పోరాటం చేసిన సైనికులందరికీ జేజేలు కొట్టాలని పేర్కొంటూ దేశాన్ని కాపాడుకోవడానికే భారత్‌ ఎదురు దాడికి దిగిందని, ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారని కొనియాడారు. దేశ ఐకమత్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వెంకయ్య చెప్పారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్‌ సిహెచ్‌ విద్యాసాగర్‌రావు మాట్లాడుతూ  హైదరాబాద్ ఉగ్రవాదులకు అడ్డగా మారిందని, కొన్ని రాజకీయ శక్తులు వారికి ఆశ్రయం ఇస్తున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదులకు ముగింపు పలకాలని ఆయన స్పష్టం చేశారు.
 
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు భారత సైనికులు ధీటుగా సమాధానం చెప్పారని తెలిపారు. తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసి మన సైన్యం దెబ్బ ఏంటో చూపించి పాకిస్తాన్ తోక వంకర చేసిందని చెప్పారు. నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ఇది జస్ట్ శాంపిల్ మాత్రమేనని స్పష్టం చేశారు.  ఈ యుద్ధంలో స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఆయుధాలను ఉపయోగించామని, సైన్యంలో మన ఆయుధాలతో నిండిపోయిందని తెలిపారు.