టర్కీ కంపెనీ క్లియరెన్స్‌ రద్దు

టర్కీ కంపెనీ క్లియరెన్స్‌ రద్దు

* టర్కీతో ఒప్పందాలు నిలిపివేసిన జామియా మిలియా ఇస్లామియా

పాకిస్థాన్‌కు మద్దతు ఇవ్వడంతోపాటు డ్రోన్లు, ఆయుధాలు సరఫరా చేసిన టర్కీపై భారత్‌ కఠిన చర్యలు చేపడుతున్నది. దేశంలోని పలు విమానాశ్రయాల్లో గ్రౌండ్‌ హ్యాండ్లింగ్‌ సేవలు అందించే టర్కీ సంస్థ సెలెబి ఏవియేషన్ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్‌) ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. 

జాతీయ భద్రత దృష్ట్యా, సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ భద్రతా అనుమతిని రద్దు చేసినట్లు అందులో పేర్కొంది. టర్కీకి చెందిన సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ సంస్థకు గ్రౌండ్ హ్యాండ్లింగ్ ఏజెన్సీ కేటగిరీ కింద 2022 నవంబర్‌ 21 అనుమతి లభించింది. ఢిల్లీ, ముంబై, చెన్నైతో సహా తొమ్మిది ప్రధాన విమానాశ్రయాలలో కీలకమైన హై సెక్యూరిటీ కార్యకలాపాలకు సెలెబి ఏవియేషన్ బాధ్యత వహిస్తున్నది. 

గ్రౌండ్ హ్యాండ్లింగ్, కార్గో సర్వీసెస్, ఎయిర్‌సైడ్ ఆపరేషన్స్ వంటి కీలక విధులను ఈ కంపెనీ నిర్వహిస్తున్నది. ఈ కార్యకలాపాలన్నీ జాతీయ భద్రతతో ముడిపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టర్కీకి చెందిన సెలెబి ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్‌ను భారత్‌ రద్దు చేసింది.

వైజాగ్ ఎయిర్‌పోర్టు బాధ్యతలు సైతం ఈ సంస్థకు దఖలు పడాల్సి ఉండగా ఇంతలో కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్‌ను రద్దు చేసింది. అంతకుముందు సెలెబీపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ముంబై ఎయిర్‌పోర్టుకు లేఖ రాసింది. జాతీయ భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. పాక్‌కు తుర్కియే వంత పాడుతున్న విషయాన్ని ప్రస్తావించింది.

అయితే, దీనిపై మంగళవారం సెలెబీ సంస్థ సీఈఓ లేఖ రాశారు. తాము భారతీయ వ్యాపారసంస్థగా మాత్రమే కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. తమ కార్యకలాపాలకు భారతీయులు నేతృత్వం వహిస్తున్నారని చెప్పారు. స్థానిక మార్కెట్‌లో భారీగా పెట్టుబడులు పెట్టామని, ఇక్కడి ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తమ పెట్టుబడులకు సంబంధించి ఎఫ్ఐపీబీ, ఎఫ్‌డీఐ అనుమతులు ఉన్నాయని తెలిపారు. 

బోర్డు డైరెక్టర్లలో ఎవరూ తుర్కియే జాతీయులు కాదని, ముంబైలో తమ సంస్థలో 3 వేల మంది భారతీయులు ఉన్నారని చెప్పుకొచ్చారు. పోలీసుల తనిఖీల తరువాతే తమ ఉద్యోగులు ఎంపిక అయ్యారని వెల్లడించారు. తాము పూర్తి వ్యాపార సంస్థని రాజకీయ సంబంధాలు, అభిప్రాయాలు లేవని స్పష్టం చేశారు. అయినా సెలెబీ సంస్థ సెక్యూరిటీ క్లియరెన్స్ రద్దయ్యాయి. అయితే దీనిపై సెలెబీ సంస్థ ఇంకా స్పందించాల్సి ఉంది. 

కాగా, దేశ రాజధాని ఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) బాటను జామియా మిలియా ఇస్లామియా  అనుసరించింది. టర్కీ విద్యా సంస్థలతో జరిగిన ఒప్పందాలను నిలిపివేసింది. జామియా మిలియా ఇస్లామియా పీఆర్వో, ప్రొఫెసర్ సైమా సయీద్ ఈ విషయాన్ని తెలిపారు. ‘టర్కీతో అనుబంధంగా ఉన్న విద్యా సంస్థలతో ఉన్న అన్ని అవగాహన ఒప్పందాలను మేం నిలిపివేశాం. దేశం, భారత ప్రభుత్వంతో జామియా నిలుస్తుంది’ అని తెలిపారు.

భారత్ – పాకిస్థాన్ లమధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సందర్భంగా పాకిస్థాన్‌కు టర్కీ బహిరంగంగా మద్దతు ఇవ్వడంతో భారత్ లో తీవ్ర ఆగ్రవేశాలు వెల్లడి అవుతున్నాయి. టర్కీ అందించిన డ్రోన్లు, ఇతర ఆయుధాలను పాక్‌ ప్రయోగించగా భారత్‌ అడ్డుకుని ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఆ దేశం వస్తువులను వ్యాపారులు బహిష్కరించారు. టర్కీకి టూర్‌ ప్యాకేజీలను ట్రావెల్‌ ఏజెన్సీలు నిలిపివేశాయి. అలాగే టర్కీతో జరిగిన ఒప్పందాలను పలు సంస్థలు నిలిపివేస్తున్నాయి.