
భారత్ – పాక్ ల మధ్య కాల్పుల విరమణ ప్రకటన శుభపరిణామమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు. కాల్పులు విరమిద్దాం అని పాకిస్తాన్ కోరటంతో భారత్ ఒప్పుకుందని పేర్కొంటూ యుద్ధంలో నష్టపోయిన భారతీయులందరికీ సంతాపం ప్రకటిస్తూ, దేశ భద్రత కోసం కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు తెలుపుతూ తీర్మానం చేద్దామని వెల్లడించారు.
దేశమే ముందు అనేది అందరి నినాదమని సీఎం వ్యాఖ్యానించారు. దేశానికి కష్టమొస్తే, సంఘటితంగా ఉండటంతో పాటు అందరూ కలసికట్టుగా నడవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని స్పష్టం చేశారు. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం సాయంత్రం భేటీ అయ్యారు. ఇరుదేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలపై గవర్నర్‌తో చర్చించారు.
ఏపీలోని సముద్ర తీర ప్రాంతాల్లో చేపట్టిన చర్యలపై వివరించారు. రాష్ట్రంలోని ముఖ్య నగరాల్లో తీసుకుంటున్న భద్రతా చర్యలపై సీఎం చంద్రబాబు గవర్నర్‌కి వివరించారు. రాజ్ భవన్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి అనిత, 6 మతాల పెద్దలు గవర్నర్తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ, ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న అతిపెద్ద సమస్య ఉగ్రవాదం ని, అభివృద్ధి చెందుతున్న భారత దేశ శాంతి సుస్థిరతలపై ఉగ్రవాదం దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశ రక్షణ కోసం జరిగిన వీరోచిత పోరాటంలో మురళీనాయక్ వీరమరణం పొందటం బాధాకరమని తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటూ ఎవరు మనపైకి వచ్చినా ఉపేక్షించే పరిస్థితి లేదని స్పష్టం చేశారు.
అందరూ బాగుండాలంటూ కోరుకునే భారతదేశం ఎప్పుడూ సహనానికి మారు పేరని ఉపముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. అన్ని కుల మతాలను గౌరవించే నేల భారతదేశం అని స్పష్టం చేశారు. పాకిస్తాన్ విభజన నుంచి ఉగ్రవాదం అనేది వెంటే ఉంటోందని దుయ్యబట్టారు. కష్ట సమయంలో భారతీయులమంతా ఒక్కటే అని చాటి చెప్పిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
భిన్నత్వంలో ఏకత్వం చూపుతున్న అన్ని మతాల పెద్దలకు హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత హ్యాట్సాఫ్ చెప్పారు. కాల్పుల విరమణ ప్రకటన కూడా రావటం శుభపరిణామమని చెప్పారు.
More Stories
యోగా దినోత్సవంకు ముస్తాబవుతున్న విశాఖ
గోదావరి జలాలపై కలిసి మాట్లాడుకొందాం
ప్రముఖ సాహితీవేత్త పులిచెర్ల సాంబశివరావు ఇక లేరు