తృటిలో త‌ప్పించుకున్న మసూద్ అజహర్

తృటిలో త‌ప్పించుకున్న మసూద్ అజహర్
* 10 మంది కుటుంభం సభ్యులు, మరో నలుగురు సహచరులు హతం 

పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ బహావల్ పూర్ తృటి త‌ప్పించుకున్నాడు.. అయితే జైషే మహమ్మద్ స్థావరం నామరేపల్లేకుండా పోయింది. వైమానిక దాడి తర్వాత, ముజఫరాబాద్‌లోని హఫీజ్ లష్కర్ ఉగ్రవాద స్థావరంలో భయాందోళనలు నెలకున్నాయి. అక్కడి నుంచి మృతదేహాలను వెలికి తీస్తున్నారు. 

ఉగ్రవాదంపై భారతదేశం జరిపిన సైనిక చర్యలో పాకిస్తాన్ ఉగ్రవాది మసూద్ అజార్ కుటుంబం నాశనమైంది. భారత వైమానిక దాడిలో, జైషే మహ్మద్ ఉగ్రవాది అజార్ కుటుంబానికి చెందిన 10 మంది సభ్యులు మరణించగా, నలుగురు అనుచరులు కూడా మరణించారు. మృతుల్లో జైషే చీఫ్ మసూద్ అజహర్ సోదరి, బావ, మేనల్లుడు ఉన్నారు. దాడి జ‌రిగిన స‌మ‌యంలో మ‌సూద్ వేరే ప్రాంతంలో ఉండ‌టంతో బ‌తికిబ‌య‌ట‌ప‌డ్డాడు..

ఈ దాడి జరిగిన తర్వాత జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ఓ లేఖను విడుదల చేశారు. ఇక, భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీపై విషం కక్కుతూ లేఖను మసూద్ విడుదల చేశారు. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియామాలు ఉల్లంఘించారు అని తీవ్రంగా మండిపడ్డారు.  నాకు భయం లేదు, నిరాశ లేదు, విచారం లేదంటూ ఆ లేఖలో పేర్కొన్నాడు. అయితే, ప్రధాని మోదీని, భారతదేశాన్ని నాశనం చేస్తానంటూ హెచ్చరించారు. భారత్ పై త్వరలోనే ప్రతీకారం తీర్చుకోవడానికి ప్లాన్ చేస్తానంటూ మసూద్ అజహర్ లేఖలో ప్రస్తావించారు.

అంతర్జాతీయ సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న బహవల్‌పూర్‌లోని మర్కజ్‌ సుబాన్‌ అల్లాహ్​పై భారత సైన్యం దాడి చేసింది. దీన్ని జైషే మహ్మద్‌కు ఆపరేషనల్‌ హెడ్‌క్వార్టర్‌గా గుర్తిస్తారు. పుల్వామా దాడి సహా భారత్‌పై చాలా కుట్రలకు ఇక్కడే ప్రాణాళిక రచించారు. దీనినే మసూద్ తన ఇంటిగా కూడా వినియోగిస్తాడు. 

ప్రస్తుతం జేషే నెంబర్‌-2గా ఉన్న ముఫ్తీ అబ్దుల్‌ రవూఫ్‌ అస్గర్‌, మౌలానా అమర్‌ ఇతరుల కుటుంబ సభ్యులు కూడా ఇక్కడే ఉంటున్నట్లు తెలుస్తోంది. సుమారు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు కూడా ఈ క్యాంపస్‌లోనే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్ ముజాహిద్దీన్‌ వంటి ఉగ్రసంస్థలకు చెందిన ప్రధాన స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసి వాటిని నేలమట్టం చేసింది. 

దేశంలో జరిగిన పలు ఉగ్రదాడులకు ఈ క్యాంపుల్లోనే ప్రణాళిక జరిగిందని కర్నల్‌ సోఫియా ఖురేషి తెలిపారు. 2008 ముంబయి ఉగ్రదాడుల సూత్రధారి డేవిడ్ హెడ్లీ, అజ్మల్ కసబ్ శిక్షణ పొందిన ఉగ్రస్థావరంపైనా దాడి చేశామని వెల్లడించారు. పాక్‌ పౌరులకు హాని కలగని రీతిలో కేవలం ఉగ్ర శిబిరాలపైనే దాడులు చేశామని తెలిపారు. పాక్ సైనిక శిబిరాలను లక్ష్యంగా చేసుకోలేదని స్పష్టం చేశారు.