ప్రపంచ ‘మానవాభివృద్ధి సూచీ’లో భారత్ పురోగతి సాధించింది. 2023 ఏడాదికి సంబంధించి మొత్తం 193 దేశాల్లో భారత్కు 130వ స్థానం దక్కింది. అంతకుముందు ఏడాది అంటే 2022తో పోల్చుకుంటే మూడు స్థానాలు మెరుగుపడింది. 2022 ఏడాదికి సంబంధించిన మానవాభివృద్ధి సూచీలో భారత్ 133వ స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఏడాది మూడు స్థానాలు పురోగతి చెందింది.
ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం (యూఎన్డీపీ) కి సంబంధించిన మానవాభివృద్ధి సూచీ-2025 నివేదిక మంగళవారం విడుదలైంది. ఈ నివేదికలో 2023 ఏడాదికి సంబంధించిన డేటాను ప్రకటించారు. అదేవిధంగా లింగ అసమానత సూచీలో కూడా భారత్ వృద్ధిని నమోదు చేసింది. 2023లో మొత్తం 193 దేశాల్లో భారత్ 102వ స్థానంలో నిలిచింది.
అంతకుముందు ఏడాది అంటే 2022లో 166 దేశాల్లో భారత్ 108వ స్థానం దక్కించుకుంది. అంటే ఈ ఏడాది ఆరు స్థానాలు మెరుగుపడింది. పాకిస్తాన్ 168వ స్థానంకు పడిపోవడంతో, ఆ దేశం కన్నా భారత్ 19 శాతం ముందంజలో ఉంది. తలసరి ఆదాయంలో పాకిస్థాన్ కన్నా 57 శాతం ఎక్కువగా ఉంది. కరోనా కాలంలో దెబ్బతిన్నప్పటికీ ఆ తర్వాత భారత్ పురోగతి క్రమంగా కొనసాగుతున్నట్లు స్పష్టం అవుతుంది. ఆదాయం, ఆరోగ్యం, విద్యలలో భారత్ లో పురోగతి స్పష్టంగా కొనసాగుతున్నది.
హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ – 2025 ప్రకారం భారతీయుల జీవిత కాలం కూడా మెరుగుపడింది. 2023లో భారత పౌరుడి సగటు జీవితకాలం 72 ఏళ్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాది అంటే 2022లో భారత పౌరుడి సగటు జీవితకాలం 71.7 ఏళ్లుగా ఉంది. ఇప్పటికే వరకు ఇచ్చిన నివేదికల్లో ఇదే అత్యధిక సగటు జీవితకాలమని యూఎన్డీపీ తెలిపింది. 1990లో భారత పౌరుడి సగటు జీవితకాలం అతితక్కువగా 58.6 ఏళ్లు ఉందని వెల్లడించింది.

More Stories
సర్క్రీక్ వద్ద భారత త్రివిధ దళాల త్రిశూల్ విన్యాసాలు
వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో ఎస్ఐఆర్
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం