రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స

రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
 
రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు నగదు రహిత చికిత్సను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకం మంగళవారం నుంచి అమల్లోకి వచ్చింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర రహదారుల రవాణాశాఖ విడుదల చేసింది. మంగళవారం నుంచే ఈ పథకం అమల్లోకి వచ్చినట్లు తెలిపింది. ఈ పథకం ద్వారా రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులు రూ.1.5 లక్షల వరకూ ఉచిత వైద్య సేవలు పొందవచ్చు.

రోడ్డు ప్రమాద బాధితులకు గోల్డెన్‌ అవర్‌లో ఉచిత వైద్యం అందించాలని సుప్రీంకోర్టు గత జనవరిలో తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇందు కోసం కేంద్రం ‘క్యాష్‌లెస్‌ ట్రీట్‌మెంట్‌ ఆఫ్‌ రోడ్‌ యాక్సిడెంట్‌ విక్టిమ్స్‌ స్కీం-2025’ పథకాన్ని అందుబాటులోకి తెచ్చింది. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్సకు అయ్యే ఖర్చులో గరిష్ఠంగా రూ.1.50 లక్షలు ఈ పథకం ద్వారా ప్రభుత్వమే భరిస్తుంది. 

అయితే ఇది మొదటి ఏడు రోజుల చికిత్సకు అయ్యే బిల్లుకు మాత్రమే వర్తిస్తుంది. ఈ స్కీం ద్వారా చికిత్స పొందాలంటే ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు పోలీసులకు సమాచారం అందిస్తేనే క్యాష్ లెస్ ట్రీట్ మెంట్ కు అర్హులు.  బాధితుడు డిశ్చార్జి అయిన తర్వాత వైద్య సేవలు అందించిన ఆసుపత్రి అందుకు సంబంధించిన బిల్లును ప్యాకేజీకి అనుగుణంగా పోర్టల్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

రోగులకు ట్రామా, పాలీట్రామా సేవలు అందించగల సామర్థ్యం ఉన్న అన్ని ఆసుపత్రులనూ ఈ పథకం కిందికి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఈ నోటిఫికేషన్‌లో సూచించింది. భారతదేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారు. దాదాపు 4 లక్షల మంది తీవ్రంగా గాయపడుతున్నారు. అధికారిక గణాంకాల ప్రకారం, రోడ్డు ప్రమాదాల వల్ల ఎక్కువగా నష్టపోతోంది ద్విచక్ర వాహనదారులు, పాదచారులే.