* ప్రధాని మోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ
ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కు రష్యా మరోసారి మద్దతు ప్రకటించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేశారు. పహల్గాం ఉగ్రవాద దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ తెలిపారు. “రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గాం జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన మృతులకు తీవ్ర సంతాపం తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి ఆయన పూర్తి మద్దతు ప్రకటించారు” అని జైస్వాల్ పేర్కొన్నారు.
ఈ దారుణమైన ఘటనకు పాల్పడిన వారిని, వారి మద్దతుదారులను చట్టం ప్రకారం శిక్షించాలని అన్నారని, భారతదేశం- రష్యా విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పెంచుకుంటామని చెప్పారని చెప్పారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధాని నరేంద్ర మోదీ విక్టరీ డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల జరిగిన పహల్గాం దురాగతానికి సంబంధించి కీలకమైన విషయాల్ని పుతిన్ కు మోదీ తెలియజేసినట్టు సమాచారం. ఉగ్రవాదులకు పాక్ ప్రభుత్వం, పాక్ సైన్యం అందిస్తున్న సహకారం గురించి, దానివల్ల ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న అనర్థాల గురించి కూడా పుతిన్ కు ప్రధాని మోదీ వివరించారు.
ఇంతకు ముందు ఉగ్రదాడిని పుతిన్ ఖండించారు. ఈ విషాద సమయంలో భారత్‌కు అండగా ఉంటామని ప్రకటించారు. ఈ మేరకు పహల్గాం నేపథ్యంలో భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంతాప సందేశం పంపారు. ఈ దారుణమైన నేరాన్ని సహించేది లేదని, ఈ దాడికి కారకులైన వారిని తప్పకుండా శిక్షిస్తారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో భారత్‌తో మా సహకారాన్ని మరింతగా పెంచుకోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ దుర్ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని, గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పుతిన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు.
మరోవైపు, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి రాజేశ్ కుమార్ సింగ్ సమావేశమయ్యారు. ప్రస్తుత పరిస్థితుల్లో మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇక ఆదివారం ప్రధానితో ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ కూడా సమావేశమయ్యారు. భారత్- పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ త్రివిధ దళాల అధిపతులతో ప్రధాని వరుసగా భేటీ అవుతున్నారు.
ఎయిర్ చీఫ్ మార్షల్ అమర్ ప్రీత్ సింగ్ ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీతో న్యూఢిల్లీలో సమావేశమయ్యారు. గత నెల 26న జరిగిన రక్షణ సంబంధిత ఉన్నత స్థాయి సమావేశంలో పాక్‌పై చర్యలు తీసుకొనే విషయంలో సాయుధ బలగాలకు మోదీ పూర్తి స్వేచ్ఛనిచ్చారు. మరోవైపు రక్షణ సన్నాహకాల్లో భాగంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ తన ఉద్యోగులందరికీ సెలవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

More Stories
తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటులో రాజకీయ అనిశ్చితి
బిజెపి చిహ్నాలతో హింసను రెచ్చగొడుతున్న టిఎంసి!
పంజాబ్ జంట ప్రేలుళ్ళ వెనుక పాక్, ఐఎస్ఐ ప్రమేయం!