మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె

మే 6 అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సమ్మె
 

తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్‌ మోగింది. త‌మ డిమాండ్ల‌పై రేవంత్ రెడ్డి స‌ర్కార్ స్పందించ‌క‌పోవ‌డంతో మే 7వ తేదీ నుంచి నిర‌వ‌ధిక స‌మ్మె చేయాల‌ని ఆర్టీసీ కార్మిక సంఘాలు నిర్ణ‌యించాయి. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మే 6వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి ఆర్టీసీ బ‌స్సులు బంద్ కానున్నాయి. బ‌స్సుల‌న్నీ డిపోల‌కే ప‌రిమితం కానున్నాయి.

మే 7వ తేదీ నుంచి కార్మికలు సమ్మెకు వెళ్లబోతున్నట్లు ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న ప్రకటించారు. మేడే స్ఫూర్తితో ఆర్టీసీ సమ్మెకు సిద్దమయ్యామని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, తమ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లపై వెంటనే స్పందించాలని ప్రభుత్వానికి సూచించారు. 

మంగళవారం నారాయణగూడలోని ఏఐటీయూసీ కార్యాలయంలో ఆర్టీసీ కార్మిక జేఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా సమ్మె‌కు సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఆర్టీసీ కార్మిక జేఏసీ విడుదల చేసింది. అనంతరం ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న మాట్లాడుతూ సమ్మెకు ముందు అంటే, మే 5వ తేదీన ఆర్టీసి కార్మికులు కార్మిక కవాతు నిర్వహిస్తామని చెప్పారు.  ఆర్టీసి కళ్యాణ మండపం నుంచి బస్సు భవన్ వరకు ఈ సమ్మెకు మద్దతుగా ఆర్టీసి యూనిఫారంలో కార్మికులంతా ఈ కవాతులో పాల్గొంటారని పేర్కొన్నారు.

ఆర్టీసీ పరిరక్షణ, విలీన ప్రక్రియ పూర్తి చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.   ప్రైవేటీకరణకు మూలమైన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యం కొనుగోలు చేసి నడపాలన్నారు. 2021 వేతన సవరణ చేయాలని.. అలాగే పెండింగ్ బకాయిలను సైతం చెల్లించాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 
 
ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసి కార్మికులకు ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ఆర్టీసీ సంస్థలో 16 వేల మంది రిటైరయ్యారని.. ఆ ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆర్టీసీలో నెలకొన్న సమస్యలపై తమ వైఖరిని తెలపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు.
 
ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్‌ కమిషనర్‌ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో స‌మ్మెకు సిద్ధమయ్యారు.