క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం

క్రిమియాను రష్యాకు వదులుకునేందుకు ఉక్రెయిన్ విముఖం

క్రిమిమాను ఎప్పటికీ రష్యాలో భాగంగా గుర్తించబోమని, ఈ విషయంలో అమెరికా ప్రతిపాదనను తాము ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించబోమని ఉక్రెయిన్‌  స్పష్టం చేసింది. రష్యా-ఉక్రెయిన్ దేశాల మధ్య శాంతి ఒప్పందంలో భాగంగా క్రిమియాపై రష్యా నియంత్రణను అమెరికా గుర్తించిందని, ఇకపై క్రిమియా రష్యాతోనే ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇటీవల చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్‌ తిరస్కరించింది.

అమెరికా చేసిన శాంతి ప్రతిపాదనలో క్రిమియాపై రష్యా అధికారం ఉంటుందని పేర్కొనడం తమను షాక్‌కు గురిచేసిందని ఉక్రెయిన్‌ పేర్కొంది. అమెరికా ప్రతిపాదనకు అసలు అర్థమేలేదని జెలెన్‌స్కీ పార్టీ ఎమ్మెల్యే ఒలెక్సాండర్ మెరెజ్ఖో విమర్శించారు. క్రిమియాను రష్యా చట్టవిరుద్ధంగా ఆక్రమించుకుందని, దానిని ఆ దేశానికి పూర్తిగా ఇచ్చేయడం అసాధ్యమని పేర్కొన్నారు.

అందుకోసం దేశ రాజ్యాంగంలో మార్పులు చేయాల్సి ఉంటుందని, దేశవ్యాప్తంగా ప్రజల అంగీకారం తీసుకోవాల్సి ఉంటుందని ఒలెక్సాండర్‌ తెలిపారు. క్రిమియాను వదులుకోవడం అంటే తమ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి రాజకీయ ఆత్మహత్యతో సమానమని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ఆయన భవిష్యత్తులో ఎన్నో చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు. 

అంతేకాకుండా దీన్ని తమ దేశంలో రాజద్రోహంగా పరిగణిస్తారని, ఉక్రెయిన్‌ ప్రభుత్వం ఎప్పటికీ అలాంటి చర్యలు తీసుకోదని చెప్పారు. మరోవైపు ఉక్రెయిన్‌ ప్రభుత్వం రాజకీయంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పటికీ తాము ఈ పోరాటాన్ని ఎన్నటికీ ఆపబోమని ఉక్రెయిన్‌ సైనిక అధికారులు పేర్కొన్నారు. ఈ యుద్ధంవల్ల ఎందరో సైనికులు ప్రాణాలు కోల్పోయారని, వారి త్యాగాలకు ఫలితం కచ్చితంగా తమ దేశ ప్రజలకు దక్కాలని అన్నారు. 

దక్షిణ ఉక్రెయిన్‌లో నల్ల సముద్రం వెంట ఉన్న క్రిమియా వ్యూహాత్మక ప్రాంతం. 2014లో రష్యా దాన్ని స్వాధీనం చేసుకుంది. తాజాగా ఇదే అంశంపై మాట్లాడిన ట్రంప్‌ క్రిమియా రష్యాతోనే ఉంటుందని తెలిపారు. అయితే ఉక్రెయిన్‌పై రష్యా భీకర దాడులకు పాల్పడుతుండటంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన ఆయన ఇది సరైన సమయం కాదని హితవు చెప్పారు. 

వారానికి ఐదు వేల మంది సైనికులు ప్రాణాలు కోల్పోతున్నారని, ఇప్పటికైనా శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని పుతిన్‌కు సూచించారు. వాటికన్‌లో ఉక్రెయిన్‌ అధ్యక్షుడితో సమావేశం అనంతరం పుతిన్‌పై ట్రంప్‌ విమర్శలు చేశారు. పుతిన్‌కు యుద్ధాన్ని ఆపాలనే ఉద్దేశం లేదనే విషయం తనకు అర్థమవుతోందని అంటూ అసహనం వ్యక్తం చేశారు.