ఢిల్లీ నగరంలో 5వేల మంది పాకిస్తానీలు

ఢిల్లీ నగరంలో 5వేల మంది పాకిస్తానీలు

* అట్టారి మీదుగా 537 మంది పాక్ జాతీయుల నిష్క్రమణ

పహల్గాం దాడి ఘటన అనంతరం పాకిస్తానీలను స్వదేశానికి పంపేందుకు ప్రయత్నాలు భారత్ చేస్తున్నది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అనేక రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో ఉంటున్న పాకిస్తానీ పౌరులను తిరిగి ఆ దేశానికి పంపే పనిలో పడ్డాయి. అయితే, దేశ రాజధాని ఢిల్లీ నగరంలో 5వేల మంది పాకిస్తానీలు పౌరులు ఉన్నట్లుగా గుర్తించారు. భారత నిఘా విభాగం ఈ మేరకు జాబితాను ఢిల్లీ పోలీసులకు అందించింది.

ఢిల్లీలో నివాసం ఉంటున్న 5వేల మంది పాకిస్తానీ పౌరుల జాబితాను ఐబీ ఢిల్లీ పోలీసులకు అందించి.. స్వదేశానికి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నది. విదేశీయుల ప్రాంతీయ రిజిస్ట్రేషన్‌ కార్యాలయం ఈ జాబితాను ఢిల్లీ పోలీసుల ప్రత్యేక శాఖకు అందించింది. జాతీయ మీడియా నివేదిక ప్రకారం జాబితాలో దీర్ఘకాలిక వీసాలు కలిగి ఉన్న, మినహాయింపు పొందిన హిందూ పాకిస్తానీ జాతీయుల పేర్లు సైతం ఉన్నారు.

ఈ జాబితా ధ్రువీకరణ కోసం సంబంధిత జిల్లా అధికారులకు అందించి వారంతా స్వదేశానికి తిప్పి పంపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. మధ్య, ఈశాన్య జిల్లాల్లో పాకిస్తానీ జాతీయుల సంఖ్య ఎక్కువగా ఉన్నది. ఈ విషయంపై సమావేశం ఏర్పాటు చేశామని, ఈ విషయంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించినట్లు ఓ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

పరిస్థితిని సీనియర్‌ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు. ఢిల్లీలో నివసిస్తున్న ఈ పాకిస్తానీ పౌరుల గురించి సమాచారాన్ని సేకరించి, వీలైనంత త్వరగా భారతదేశం విడిచి వెళ్లేలా ఢిల్లీ పోలీస్‌, ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేక శాఖ అధికారులు అప్పగించారు. ఇప్పటికే వీసాలపై భారత్‌కు వచ్చిన వారంతా మే ఒకటో తేదీ వరకు దేశం విడిచి వెళ్లిపోవాలని భారత్ ఆదేశాలు జారీ చేసిన విషయం విధితమే.

ఇలా ఉండగా, పాకిస్తాన్‌కు చెందిన 12 కేటగరీల స్వల్పకాలిక వీసాదారులకు దేశం వీడివెళ్లేందుకు గడువు ఆదివారం ముగియగా శుక్రవారం నుంచి మూడు రోజుల్లో తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా 537 మంది పాకిస్తానీ జాతీయులు అట్టారి వాఘా సరిహద్దు మీదుగా భారత్ నుంచి నిష్క్రమించినట్లు అధికారులు వెల్లడించారు. పంజాబ్‌లో గల ఆ అంతర్జాతీయ సరిహద్దు మీదుగా 14 మంది దౌత్యవేత్తలు, అధికారులు సహా 745 మంది భారతీయులు పాకిస్తాన్ నుంచి తిరిగి వచ్చారు. 

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో పాకిస్తాన్‌కు చెందిన ఉగ్రవాదులు ఈ నెల 22న పర్యాటకులు సహా 26 మందిని హతమార్చిన తరువాత ‘దేశం వీడివెళ్లండి’ అని పాకిస్తానీ జాతీయులకు ప్రభుత్వం నోటీస్ జారీ చేసింది. ఆదివారం అట్టారి వాఘా సరిహద్దు మీదుగా తొమ్మిది మంది దౌత్యవేత్తలు, అధికారులతో సహా 237 మంది పాకిస్తానీ జాతీయులు భారత్‌ను వీడి వెళ్లారని, శనివారం 81 మంది, శుక్రవారం 191 మంది పాకిస్తానీ జాతీయులు అలా వెళ్లిపోయారని అధికారులు  చెప్పారు. 

విధించిన గడువులోగా భారత్‌ను విడిచి తిరిగి వెళ్లకుంటే కఠిన చర్యలు ఉంటాయని పాకిస్థానీలను కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. ఈ ఆదేశాలు పాటించకుంటే మూడేళ్ల జైలు శిక్షగానీ రూ.3 లక్షల జరిమానాగానీ విధిస్తామని తెలిపింది. లేదంటే రెండు శిక్షలూ విధించే అవకాశం ఉందని తెలిపింది.