గుజరాత్ లో 1000 మంది అక్రమ బంగ్లా వలసదారులు అరెస్ట్!

గుజరాత్ లో 1000 మంది అక్రమ బంగ్లా వలసదారులు అరెస్ట్!

* మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు

జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలో అమాయకులైన పర్యాటకులపై పాక్‌ ఉగ్రవాదులు దాడులకు పాల్పడిన నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. భారత్‌లో ఉంటున్న వలసదారులపై ప్రత్యేక నిఘా పెట్టాయి. ఈ క్రమంలోనే గుజరాత్‌లో చేపట్టిన భారీ ఆపరేషన్‌లో 1000 మందికి పైగా బంగ్లాదేశీ అక్రమ వలసదారులను గుర్తించారు. పోలీసులు వారందరినీ ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. వీరంతా తప్పుడు ధ్రువపత్రాలతో రాష్ట్రంలోకి ప్రవేశించినట్లు గుజరాత్ హోంమంత్రి హర్ష్‌ సంఘవి తెలిపారు.

శనివారం తెల్లవారుజామున 3 గంటల నుంచి గుజరాత్‌లోని పలు పట్టణాలు, నగరాల్లో పోలీసులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగానే అహ్మదాబాద్‌లో 890 మందిని, సూరత్‌లో 134 మంది బంగ్లాదేశ్‌కు చెందిన అక్రమ వలసదారులను అదుపులోకి తీసుకున్నట్లు హోంమంత్రి తెలిపారు.  వీరిలో స్త్రీలు, చిన్నారులు కూడా ఉన్నారని, వీరంతా పశ్చిమ బెంగాల్‌లో సరిహద్దులు దాటి ఇండియాలోకి ప్రవేశించినట్లు ఆయన పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్‌లోనే ఫోర్జరీ ప్రతాలు సంపాదించి, దేశంలోని వివిధ ప్రాంతాలకు వారు వెళ్లినట్లు ఆయన తెలిపారు.

“బంగ్లాదేశ్‌కు చెందిన ఈ అక్రమ వలసదారుల్లో చాలా మంది డ్రగ్స్‌, మానవ అక్రమ రవాణా వంటి నేరాల్లో అనుమానితులుగా ఉన్నారు. ఇటీవల నలుగురు బంగ్లాదేశీయులను అరెస్టు చేశాం. వారిలో ఇద్దరు అల్‌ఖైదా స్లీపర్‌ సెల్స్‌తో కలిసి పనిచేస్తున్నట్లుగా గుర్తించాం” అని హోంమంత్రి తెలిపారు.  “ఈ క్రమంలోనే తాజాగా భారీ ఆపరేషన్‌ చేపట్టాం. వీరందరి పత్రాలను పరిశీలించిన తర్వాత, త్వరలోనే మన దేశం నుంచి పంపించేస్తాం. అక్రమ వలసదారులకు ఆశ్రయం ఇచ్చిన వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటాం” అని హర్ష్‌ సంఘవి పేర్కొన్నారు.

గుజరాత్‌లో పాక్‌ జాతీయులు ఎవరైనా ఉంటే, కేంద్రం తీసుకున్న నిబంధనల ప్రకారం, వారు కూడా వెంటనే భారతదేశాన్ని వీడాలని హోం మంత్రి హర్ష్‌ సంఘవి స్పష్టం చేశారు. చట్ట వ్యతిరేకంగా దేశంలో ఉండే పాక్‌ పౌరులపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఎవరైనా అక్రమ వలసదారులు రాష్ట్రంలో ఉంటే, వెంటనే వారు పోలీసులకు లొంగిపోవాలని సూచించారు.

కాగా, మహారాష్ట్రలో 5 వేల మంది పాకిస్థానీయులు ఉన్నారని, అందులో వెయ్యి మంది స్వల్పకాలిక వీసాలు కలిగి ఉన్నారని ఆ రాష్ట్ర మంత్రి యోగేశ్ కదమ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు దేశం విడిచి వెళ్లాలని వారికి సూచించామని చెప్పారు. “ రాష్ట్రంలో దీర్ఘకాలిక వీసాలపై వచ్చిన వారు 4 వేల మంది ఉంటారు. సార్క్ వీసా కింద మరో వెయ్యిమంది ఉన్నారు. వీరిలో సినిమాలు, వైద్యం, జర్నలిజం, వ్యక్తిగత పనులపై రాష్ట్రానికి వచ్చారు” అని మంత్రి తెలిపారు. 

పాక్ జాతీయుల్లో కొందరు ఎనిమిది నుంచి పదేళ్లుగా భారత్ లోనే ఉంటున్నారని , కొందరు వివాహం చేసుకోగా, మరికొందరు పాకిస్థాన్ పాస్‌పోర్టును సరెండర్ చేసి భారత పౌరసత్వం కోసం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. స్వల్పకాలిక వీసాలపై వచ్చిన వారు ఏప్రిల్ 27 లోగా వెళ్లిపోవాలని సూచించామని, వైద్యం కోసం వచ్చిన వారికి మాత్రం అదనంగా మరో రెండు రోజులు గడువు ఉంటుందని వివరించారు.