కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు స్వాధీనం

కుప్వారా జిల్లాలో భారీగా ఆయుధాలు స్వాధీనం

ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల నేప‌థ్యంలో జ‌మ్మూక‌శ్మీర్‌ను భార‌త బ‌ల‌గాలు జ‌ల్లెడ ప‌డుతున్నాయి. నిఘా వ‌ర్గాలు కూడా ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌లను నిశితంగా ప‌రిశీలిస్తున్నారు. జ‌మ్మూక‌శ్మీర్ కుప్వారా జిల్లాలో ఉగ్ర‌వాదుల క‌ద‌లిక‌ల‌ను నిఘా వ‌ర్గాలు ప‌సిగ‌ట్టాయి. నిఘా వ‌ర్గాల ఆదేశాల‌తో స్పెష‌ల్ ఆప‌రేష‌న్ గ్రూప్, ఆర్మీ బ‌ల‌గాలు క‌లిసి సంయుక్తంగా మాచిల్ జిల్లాలో కూంబింగ్ నిర్వ‌హించాయి. 

ఈ కూంబింగ్‌లో భాగంగా ఉగ్ర‌వాదుల రహస్య స్థావరాన్ని భద్రతాదళాలు గుర్తించి.. ధ్వంసం చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలోనే వారి స్థావరాల నుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఉగ్రస్థావరాలు ఉన్నాయని నిర్దిష్ట నిఘా వర్గాల సమాచారం మేరకు ఉత్తర కశ్మీర్‌ జిల్లాలోని సెడోరి నాలా అటవీ ప్రాంతంలో భద్రతా దళాలు సోదాలు నిర్వహించాయని అధికారులు తెలిపారు.

 భారీ స్థాయిలో దాచిన ఆయుధాలు, పేలుడు ప‌దార్థాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు తెలిపారు. ఏకే 47 తుపాకులు, మేగ‌జైన్లు, పిస్ట‌ళ్లు, పేలుడు ప‌దార్థాలు స్వాధీనం చేసుకున్నారు.  ఐదు ఏకే-47 రైఫిల్స్, ఎనిమిది ఏకే-47 మేగ‌జైన్లు, ఒక పిస్తోల్, మ‌రో పిస్తోల్ మేగ‌జైన్, 660 రౌండ్ల బుల్లెట్లతో పాటు ఇత‌ర ఆయుధాల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు పేర్కొన్నారు. 

మరోవైపు, కుల్గాం జిల్లాలో ఉగ్రవాదులతో కలిసి పనిచేస్తున్న ఇద్దరిని భద్రతా దళాలు శనివారం అరెస్ట్ చేశాయి. ఖైమోహ్ ప్రాంతంలో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నాయి.  కుప్వారా జిల్లాలో నెల‌కొన్న శాంతియుత వాతావ‌ర‌ణాన్ని విధ్వంసం చేసేందుకు ఉగ్ర‌వాదులు ప్ర‌ణాళిక‌లు ర‌చించిన‌ట్లు తెలుస్తోంది. నిఘా వ‌ర్గాల అప్ర‌మ‌త్తం కావ‌డంతో ఉగ్ర‌వాదుల ఆయుధాల‌ను స్వాధీనం చేసుకుని, అల్ల‌ర్ల‌కు అడ్డుక‌ట్ట వేశారు.