ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత

ఇస్రో మాజీ ఛైర్మన్ కస్తూరి రంగన్ కన్నుమూత
* ప్రధాని మోదీ, ఆర్ఎస్ఎస్ ఘననివాళులు

ఇస్రో మాజీ ఛైర్మన్‌ డాక్టర్‌ కస్తూరి రంగన్‌ కన్నుమూశారు. గత కొంత కాలంగా వృద్ధాప్య సంబంధిత రుగ్మతలతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని తన నివాసంలో 84 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. . ఇస్రో చైర్మెన్‌గా ఆయ‌న తొమ్మిదేళ్లు ప‌నిచేశారు. అంత‌రిక్ష రంగంలో భార‌త్‌ను అత్యున్న‌త స్థాయికి తీసుకెళ్లారు.

“కస్తూరి రంగన్‌ ఈ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో స్వర్గస్తులయ్యారు. ఏప్రిల్ 27న అంతిమ నివాళులు అర్పించేందుకు ఆయన భౌతిక కాయాన్ని రామన్ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (ఆర్‌ఆర్‌ఐ)లో ఉంచుతారు” అని అధికారులు తెలిపారు. ఇస్రో ప్ర‌యోగించిన ఎర్త్ అబ్జ‌ర్వేష‌న్ శాటిలైట్స్ భాస్క‌రా-1, 2, కు ప్రాజెక్టు డైరెక్ట‌ర్‌గా చేశారాయ‌న‌. ఇండియ‌న్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్ ఐఆర్ఎస్-1ఏ ప్ర‌యోగించ‌డంలో ఆయ‌న కీల‌క పాత్ర పోషించారు. 

కస్తూరి రంగన్‌కి ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ‘కస్తూరి రంగన్ ఇస్రోకు ఎంతో శ్రద్ధతో సేవలు అందించారు. భారత అంతరిక్ష కార్యక్రమాలను సరికొత్త శిఖరాలకు నడిపించారు. జాతీయ విద్యా విధానాన్ని రూపొందించినందుకు భారతదేశం ఎల్లప్పుడూ ఆయనకు కృతజ్ఞతతో ఉంటుంది’ అని పేర్కొన్నారు. భారతదేశపు శాస్త్రీయ, విద్యాపరమైన ప్రయాణంలో కస్తూరిరంగన్‌ ఎంతో కీలకమైన వ్యక్తని ప్రధాని చెప్పారు.

కస్తూరీరంగన్‌ దార్శనిక నాయకత్వాన్ని, ఆయన నిస్వార్థ సేవను ఈ దేశం ఎప్పటికీ మరువబోదని చెప్పారు. ఇస్రో ఛైర్మన్‌గా కస్తూరీరంగన్‌ భారతదేశపు అంతరిక్ష రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారని ప్రధాని మోదీ చెప్పారు.  కస్తూరీరంగన్‌ లాంటి మహనీయుల కృషివల్లనే ఇప్పుడు భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని అన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఎన్నో ఉపగ్రహ ప్రయోగాలు జరిగాయని తెలిపారు. ప్రధానంగా ఆయన నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తన అధికారిక ఎక్స్‌లో ఒక పోస్టు పెట్టారు.

డా. కస్తూరిరంగన్ మృతి పట్ల ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భగవత్, సర్ కార్యవాహ దత్తాత్రేయ హోసబలే ప్రగాఢ సంతాపం తెలిపారు.  “ప్రఖ్యాత అంతరిక్ష శాస్త్రవేత్త డాక్టర్ కస్తూరిరంగన్ మరణంతో, భారతదేశ జాతీయ జీవితంలో ఒక ప్రకాశవంతమైన నక్షత్రం అస్తమించింది. డాక్టర్ రంగన్ ఇప్పుడు మన జ్ఞాపకాలలో మాత్రమే మిగిలిపోయారు” అని తెలిపారు. 

“పద్మ విభూషణ్‌తో సత్కరించబడిన ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ రంగన్, శాస్త్రీయ రంగంలో ప్రపంచ దిగ్గజం; రాజ్యసభ, ప్రణాళికా సంఘం వంటి వివిధ రంగాలలో కూడా ఆయన దేశానికి సేవలందించారు. అంతరిక్ష రంగంలో ఆయన చేసిన కృషి మాదిరిగానే, భారత్ జాతీయ విద్యా విధానాన్ని రూపొందించడంలో,అమలు చేయడంలో ఆయన చేసిన కృషి కూడా ఉంది, ఇది ఒక చారిత్రాత్మక విజయం (గేమ్ ఛేంజర్)” అంటూ కొనియాడారు.

“శాస్త్రవేత్త, విధాన రూపకర్త, విద్యావేత్త, పర్యావరణవేత్త మొదలైన వివిధ పాత్రలను సమర్థవంతంగా పోషించిన కస్తూరిరంగన్, ఒక గొప్ప మానవతావాది, కరుణామయుడు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తరపున, డాక్టర్ కస్తూరిరంగన్ కుటుంబానికి , అభిమానులకు మా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాము. ఈ గొప్ప దేశభక్తుడికి నివాళులు అర్పిస్తూ, ఆయన పవిత్ర ఆత్మకు ఆయన పాదపద్మములలో స్థానం కల్పించాలని సర్వశక్తిమంతుడిని ప్రార్థిస్తున్నాము. ఓం శాంతి” అని సంతాప సందేశంలో పేర్కొన్నారు.

కస్తూరిరంగన్‌ గతంలో  జేఎన్‌యూ ఛాన్సలర్‌గా, కర్ణాటక నాలెడ్జ్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా పనిచేశారు. 1994 నుంచి 2003 వరకు ఇస్రో ఛైర్మన్‌గా పనిచేశారు. 2003-09 మధ్య కస్తూరి రంగన్‌ రాజ్యసభ సభ్యుడిగా సేవలందించారు. 2004 నుంచి 2009 మధ్య కాలంలో బెంగళూరులోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ స్టడీస్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.  మోదీ సర్కార్‌ తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం ‘ముసాయిదా కమిటీ’కి కస్తూరి రంగన్‌ అధ్యక్షుడిగా వ్యవహరించారు.

కస్తూరి రంగన్‌ 1940 అక్టోబర్‌ 24న కేరళలోని ఎర్నాకులంలో సీఎం కృష్ణస్వామి, విశాలాక్షి దంపతులకు జన్మించారు. ఈయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు.  రంగన్ తండ్రి తరపు పూర్వీకులు తమిళనాడు నుంచి వలస వచ్చి త్రిస్సూర్‌ జిల్లాలోని చాలకుడిలో స్థిరపడ్డారు. ఇక కస్తూరి రంగన్ తల్లి పాలక్కడ్ అయ్యర్‌ కుటుంబానికి చెందినవారు. 2000 సంవత్సరంలో కస్తూరి రంగన్‌కు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ పరస్కారాన్ని ప్రధానం చేసింది.