కార్యాలయం ఒక భవనంగా కాకుండా పని ప్రదేశంగా ఉండాలి

కార్యాలయం ఒక భవనంగా కాకుండా పని ప్రదేశంగా ఉండాలి
కార్యాలయం కేవలం భవనంగా ఉండకూడదని, పని చేసే ప్రదేశంగా ఉండాలని, ఎందుకంటే చేసిన పని ప్రకారం ఓ సంస్థ ఏర్పడుతుందని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్  డా. మోహన్ భగవత్  తెలిపారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) ప్రాయోజిత కార్యక్రమం అంతరాష్ట్ర జీవనంలో విద్యార్థుల అనుభవాలు (ఎస్ఇఐఎల్) ప్రాజెక్ట్ కేంద్ర కార్యాలయ భవనం  ‘యశ్వంత్’ని ఢిల్లీలో ఆయన ప్రారంభించారు.
ఢిల్లీ వంటి ముఖ్యమైన ప్రదేశంలో విద్యార్థుల సహకారంతో కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఒక పెద్ద విజయమని చెబుతూ యశ్వంతరావుజీ జన్మ శతాబ్ది సంవత్సరంలో స్థాపించిన ఈ కార్యాలయానికి ‘యశ్వంత్’ అని పేరు పెట్టడం పట్ల సంతోషం ప్రకటించారు. యశ్వంతరావు సీల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లిన స్ఫూర్తితో, ఈ విద్యార్ధి పరిషత్ కార్యాలయం నిర్మించారని అభినందించారు. 
 
దీనిలో ‘జ్ఞానం, శీలం, ఐక్యత’ అనే ప్రాథమిక స్ఫూర్తి అంతర్లీనంగా ఉందని పేర్కొంటూ విద్యార్థి ఉద్యమాన్ని అర్థం చేసుకోవాలంటే, దాని కార్యకర్తలను చూడాలని, వారంతా కలిస్తేనే ఒక సమగ్రతను కలిగిస్తారని చెప్పారు. కార్యకర్తల అనుభవాల ఆధారంగా ఓ సంస్థ  రూపుదిద్దుకుందని పేర్కొంటూ సంక్షోభ సమయాల్లో కూడా జాతీయ పరిగణన ఆధారంగా పనిచేస్తూ వస్తున్నదని కొనియాడారు.
 
ఒక సంస్థలో, ఆత్మ, బుద్ధి ఎంత అవసరమో శరీరం కూడా అంతే అవసరం అని చెబుతూ ఎక్కువ ఆడంబరం, ప్రదర్శన అవసరం లేదని, బదులుగా, మధ్యే మార్గాన్ని అవలంబించాలని డా. భగవత్ సూచించారు. నేడు మన దేశంలోనూ, ప్రపంచంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయని చెబుతూ ప్రపంచం రెండు రకాల మార్గాలను చూసిందని, ఇప్పుడు భారతదేశం వైపు ఆశతో చూస్తోందని తెలిపారు.
 
నిజమైన స్వేచ్ఛ వికసించే దేశాన్ని మనం నిర్మించాలని చెబుతూ ఈ సామర్థ్యం మన యువతలో ఉందని, వారికి కావలసింది దిశానిర్దేశం, జ్ఞానం మాత్రమే అని సర్ సంఘచాలక్ స్పష్టం చేశారు. ఈ జ్ఞానంలో ఐక్యత ఉన్నప్పుడే దానికి అర్థముంటుందని చెప్పారు. వైవిధ్యాన్ని గౌరవిస్తూనే, మనం ‘వసుధైవ కుటుంబకం’ అనే స్ఫూర్తిని అలవర్చుకోవాలని ఆయన సూచించారు. ఐక్యత లేకుండా నైతికత లేదని, నైతికత లేకుండా జ్ఞానం మనం చరిత్రలో, వర్తమానంలో చూస్తున్నట్లుగా కేవలం శక్తిని ప్రదర్శించే సాధనంగా మారుతుందని హెచ్చరించారు.
 
ఎబివిపి జాతీయ అధ్యక్షుడు ప్రొఫెసర్ రాజ్‌శరణ్ షాహి మాట్లాడుతూ, సీల్ కార్యాలయం ప్రారంభోత్సవం కలను నిజం చేయడానికి సహకరించిన వందలాది మంది కార్యకర్తల భాగస్వామ్యం, కృషి కారణంగా సాధ్యమైందని చెప్పారు. ఈ కార్యాలయం కార్యకర్తల, విద్యార్థుల జీవితాన్ని గాఢంగా ప్రభావితం చేసిన డాక్టర్ యశ్వంతరావుజీ పేరు మీద అంకితం చేస్తున్నట్లు తెలిపారు.
 
ఈ కార్యాలయం ఎబివిపి సంస్థాగత పనికి బలమైన కేంద్రంగా మారడమే కాకుండా, దేశ నిర్మాణంలో విద్యార్థుల పాత్రకు కొత్త దిశానిర్దేశం చేస్తుందని చెప్పారు. ప్రధాన కార్యదర్శి డాక్టర్ వీరేంద్ర సింగ్ సోలంకి మాట్లాడుతూ, విద్యార్థి పరిషత్‌లోని వందలాది మంది కార్మికులు తమ కృషి, త్యాగాలతో సంస్థను పెంచి పోషించారని పేర్కొన్నారు. అనేక మంది పూర్వ, ప్రస్తుత కార్యకర్తల అవిశ్రాంత కృషి కారణంగా, నేడు విద్యార్థి పరిషత్ దేశంలోని ప్రతి మూలలోనూ పనిచేస్తోందని తెలిపారు.
 
ఒకవైపు మన కార్యకర్తలు భారీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, మరోవైపు వారు జె ఎన్ యు వంటి క్యాంపస్‌లలో ఎన్నికలలో కూడా బలంగా పోటీ పడుతున్నారని చెప్పారు. ఈశాన్య భారతదేశంలో 2 లక్షల మంది సభ్యులు ఉన్నారని, 200 కంటే ఎక్కువ ప్రదేశాలలో చురుకుగా పనిచేస్తున్నదని తెలిపారు. 1980 నుండి 1985 వరకు జరిగిన కఠినమైన పోరాట సమయంలో కూడా, మన కార్యకర్తలు అంకితభావంతో పనిచేశారని కొనియాడారు.
 
అదే సమయంలో ఢిల్లీలోని మన కార్యకర్తలు సంస్థ కోసం శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని ప్రణాళిక వేయడం ప్రారంభించారని, ఈ రోజు ఈ కార్యాలయం మన పనికి కొత్త ఉత్సాహాన్ని ఇవ్వడమే కాకుండా, దేశవ్యాప్తంగా మారుమూల ప్రాంతాలలో పనిని విస్తరించడానికి ప్రేరణగా కూడా మారుతుందని తెలిపారు. 
 
ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషి పాల్గొన్నారు. ఆర్ఎస్ఎస్ సహా సర్ కార్యవహ్ లు డాక్టర్ కృష్ణ గోపాల్, ముకుంద్ సిఆర్ యెస్, అరుణ్ కుమార్, ఎబివిపి సంఘటన కార్యదర్శి ఆశిష్ చౌహాన్ వంటి ప్రముఖంగా హాజరయ్యారు. ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జగత్ ప్రకాష్ నడ్డా, ధర్మేంద్ర ప్రధాన్, పీయూష్ గోయల్, మన్సుఖ్ మాండవియా కూడా హాజరయ్యారు.