`ఒకే దేశం- ఒకే ఎన్నిక’ జెపిసి తొలి భేటీ నేడే

`ఒకే దేశం- ఒకే ఎన్నిక’ జెపిసి తొలి భేటీ నేడే
వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదం తర్వాత కేంద్ర ప్రభుత్వం వెంటనే `ఒకే దేశం- ఒకే ఎన్నిక’పై దృష్టి పెట్టింది. `ఒకే దేశం- ఒకే ఎన్నిక’  జాయింట్‌ పార్లమెంటరీ కమిటి (జెపిసి) ఏప్రిల్‌ 22న తేదీన తొలిసారి సమావేశం కానుంది. ఈ సమావేశం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటలకు జరగనుంది.  ఈ సమావేశంలో మొదటి సెషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ హేమంత్‌ గుప్తా, జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టు మాజీ ప్రదాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌ఎన్‌ ఝాలతో ఈ కమిటీ చర్చలు జరపనుంది.
రెండవ సెషన్‌లో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, 21వ లా కమిషన్‌ ఛైర్మన్‌ డాక్టర్‌ జస్టిస్‌ బిఎస్‌ చౌహాన్‌ పాల్గొననున్నారు.  చివరి సెషన్‌లో రాజ్యసభ సభ్యుడు, సీనియర్‌ న్యాయవాది డాక్టర్‌ అభిషేక్‌ మను సింఘ్వీ పాల్గొననున్నారని జెపిసి ఛైర్మన్‌ పిబి చౌదరి వెల్లడించారు. కాగా, జెపిసి ఛైర్మన్‌ పిబి చౌదరి మీడియాతో మాట్లాడుతూ “జెపిసి కమిటీ రెండు విషయాలపై నిర్ణయాలు తీసుకుంది.
దీనికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌ అన్ని భాషల్లో ప్రింట్‌ అవుతుంది. దీంతో అందరూ అభిప్రాయాలు పంచుకోవచ్చు”, అని చెప్పారు.  “రెండవది దీనికోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తేనున్నాం. ప్రస్తుతం దీన్ని సెక్రటరీ జనరల్‌ పరిశీలిస్తున్నారు. సూచనలు పంపితే వెబ్‌సైట్‌ క్రాష్‌ కాకుండా చూసుకోవడానికి టెక్నాలజీ అభివృద్ధికి మరికొంత సమయం పడుతుంది. క్యూఆర్‌ కోడ్‌ సౌకర్యంతో వెబ్‌సైట్‌ త్వరలో ప్రారంభిస్తాం. సూచనలను పార్లమెంటు సభ్యులు సమీక్షిస్తారు” అని ఆయన వివరించారు.
 
ఈ కమిటీ సభ్యులు అన్ని రాష్ట్రాల్లోనూ పర్యటిస్తారు. రాష్ట్రాల అభిప్రాయాలను పరిగనణలోకి తీసుకుంటారు. మొదటగా మహారాష్ట్ర, ఆ తర్వాత మేలో ఉత్తరాఖండ్‌, జమ్మూ అండ్‌ కాశ్మీర్‌, పంజాబ్‌- హర్యానా జూన్‌లో పర్యటన ఉంటుందని ఆయన వెల్లడించారు.