ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా సౌరవ్‌ గంగూలీ

ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా సౌరవ్‌ గంగూలీ
 
* సభ్యుడిగా వీవీఎస్‌ లక్ష్మణ్‌
 
భారత జట్టు మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ మరోసారి ఐసీసీ పురుషుల క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా నియామకమయ్యారు. దుబాయిలో ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసిసి) వార్షిక సందర్భంగా గంగూలీని మరోసారి కమిటీ చైర్మన్‌గా ఎన్నుకున్నారు. టీమిండియా మాజీ ఆటగాడు వీవీఎస్‌ లక్ష్మణ్‌ సైతం ప్యానెల్‌ సభ్యుడిగా కొనసాగనున్నాడు.  2000 నుంచి 2005 వరకు భారత జట్టు కెప్టెన్‌గా పని చేసిన గంగూలీ 2021లో తొలిసారిగా ఐసీసీ క్రికెట్‌ కమిటీ చైర్మన్‌గా ఎంపికయ్యాడు. 
మూడేళ్ల పదవీకాలం తర్వాత అనిల్‌ కుంబ్లే తన పదవికి రాజీనామా చేయడంతో గంగూలీ చైర్మన్‌గా నియామకమయ్యారు. లక్ష్మణ్‌తో పాటు డెస్మండ్‌ హేన్స్‌ (వెస్టిండీస్‌), హమిద్‌ హసన్‌ (ఆఫ్ఘనిస్తాన్‌), టెంబా బవుమా (దక్షిణాఫ్రికా), జొనాథన్‌ ట్రాట్‌ (ఇంగ్లండ్‌) కమిటీలో సభ్యులుగా కొనసాగనున్నారు.

అలాగే ఇక మహిళల కమిటీకి న్యూజిలాండ్‌ హాఫ్‌ స్పిన్నర్‌ కేథరిన్‌ క్యాంప్‌బెల్‌ నేతృత్వం వహిస్తుండగా, అవ్రిల్‌ ఫహే (ఆస్ట్రేలియా), ఫోలెట్సి మొసెకి (దక్షిణాఫ్రికా) సభ్యులుగా కొనసాగుతారు. ఇదిలా ఉండగా, గంగూలీ నేతృత్వంలోని ఈ కమిటీ వన్డే క్రికెట్‌ ఒకే బంతిని ఉపయోగించాలని సిఫారసు చేసిన విషయం తెలిసిందే. వన్డేల్లో రెండు కొత్త బాల్స్‌ రూల్స్‌ చాలాకాలంగా అమలులో ఉన్నది. 

కమిటీ సిఫారసులను ఐసీసీ డైరెక్టర్ల బోర్డ్‌ ఆమోదించాల్సి ఉంటుంది. ఆ తర్వాతే అమలులోకి వస్తుంది. జింబాబ్వేలోని హరారేలో ఐసీసీ బోర్డు సమావేశంలో ఈ అంశంపై చర్చించే అవకాశం ఉంది. ప్రస్తుతం వన్డేల్లో రెండు కొత్త తెల్ల కూకబుర్రా బంతులను వినియోగిస్తున్నారు. బౌలర్లు వేర్వేరు కొత్త బంతులను ఉపయోగించడం వల్ల.. బంతి గట్టిగా ఉండడంతో బ్యాట్స్‌మెన్‌ స్వేచ్ఛగా పరుగులు సాధించేందుకు అవకాశం ఉంటుంది.

ఆఫ్ఘన్‌ మహిళా క్రికెటర్ల కోసం టాస్క్‌ఫోర్స్‌

కాగా, ఆఫ్ఘనిస్తాన్‌ మహిళా క్రికెటర్లకు సహాయం అందించేందుకు ఐసీసీ స్పెషల్‌ టాస్క్ ఫోర్స్‌ని ఏర్పాటు చేసింది. ఆ దేశంలో తాలిబన్ల పాలన మొదలైనప్పటి నుంచి ఆటకు దూరమయ్యారు. మహిళలు క్రికెట్‌ ఆడేందుకు తాలిబన్లు వ్యతిరేకం కావడంతో ఆ దేశంలో వుమెన్స్‌ క్రికెట్‌ జట్టు ఉనికే లేకుండా పోయింది. కొందరు వుమెన్‌ క్రికెటర్లు ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లి అక్కడ క్రికెట్‌ ఆడుకుంటారు. 

వీరితో పాటు క్రికెట్‌ను కెరియర్‌గా ఎంచుకోవాలనుకునే ఆఫ్ఘన్‌ మహిళల కోసం టాస్క్‌ఫోర్స్‌ని ఏర్పాటు చేయాలని ఐసీసీ వార్షిక సమావేశాల్లో నిర్ణయించారు. భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ బోర్డుల సహకారంతో ఈ టాస్క్‌ఫోర్స్‌ పని చేయనున్నది. వుమెన్‌ క్రికెటర్లకు అవసరమైన వనరులు సమకూర్చడం. ప్రత్యక్ష ఆర్థిక సహాయం అందించేందుకు ఐసీసీ ఓ ప్రత్యేక నిధిని సైతం ఏర్పాటు చేయనున్నది.