మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి? లేదా షాడో సీఎం!

మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ ఇన్‌చార్జి? లేదా షాడో సీఎం!
 
* సచివాలయంలో సమీక్షలపై దుమారం
 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్‌ సచివాలయంలో సమీక్షలు నిర్వహించడంపై రాజకీయ దుమారం చెలరేగుతుంది.ఆమె ఏ హోదాలో సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారని పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గాంధీభవన్‌కు పరిమితం కావాల్సిన మీనాక్షి నటరాజన్‌ షాడో సీఎంగా సచివాలయంలో సమీక్షలు పెడుతుంటే, అసలు సీఎం రేవంత్‌రెడ్డి కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో సమీక్షలు చేసుకోవటం జరుగుతుంది. 

కంచ గచ్చిబౌలి భూముల వివాదం నేపథ్యంలో రేవంత్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తున్నది.  దేశవ్యాప్తంగా సెంట్రల్‌ వర్సిటీల అధ్యాపకులు, విద్యార్థులతో కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న సత్సంబంధాలను చెడగొట్టడం కోసమే అలా వ్యవహరిస్తున్నారని అధిష్ఠానానికి ఫిర్యాదులు అందినట్టు తెలుస్తున్నది. 

దిద్దుబాటు చర్యల్లో భాగంగా మీనాక్షి నటరాజన్‌ను హైదరాబాద్‌కు పంపినట్టు కాంగ్రెస్‌ శ్రేణుల్లో ప్రచారం జరుగుతున్నది. శనివారం ఆగమేఘాలపై హైదరాబాద్‌కు వచ్చిన నటరాజన్‌ నేరుగా రాష్ట్ర సచివాలయంలో అడుగు పెట్టారు. అప్పటినుంచి వరుసగా ఆమె షాడో సీఎం తరహాలో మంత్రులను, బ్యూరోక్రాట్లను, అధికారులను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు. 

సోమవారం కూడా ఆమె సచివాలయం మంత్రులతో సమీక్ష నిర్వహించడంపై విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అన్నట్టుగా ఆమె విద్యార్థులు, ప్రజాసంఘాల నుంచి వినతి పత్రాలు స్వీకరించటం, వారికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటం పట్ల అధికార వర్గాలే విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. సీఎం అయ్యాక 41 సార్లు ఢిల్లీకి వెళ్లి సమావేశాలు, సంప్రదింపులు జరిపిన రేవంత్‌రెడ్డి అందులో సగం అంటే కనీసం 20 సార్లు కూడా సచివాలయంలో అధికారులతో సమీక్షలు నిర్వహించక పోవడం గమనార్హం. 

హెచ్‌సీయూ క్యాంపస్‌ గదుల నుంచి విద్యార్థులను బయటికి రానివ్వని పోలీసులు, మీనాక్షికి మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి, ప్రభుత్వ లాంఛనాలతో వర్సిటీలోకి తీసుకెళ్లడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. మీనాక్షి హెచ్‌సీయూ భూముల వ్యవహారానికే పరిమితం అవుతారా? లేక అన్ని అధికారిక వ్యవహారాల్లో తలదూరుస్తారా? అని కాంగ్రెస్ వర్గాలే ప్రశ్నించుకొంటున్నాయి. 

పార్టీ ఇన్‌చార్జి ఇలా సచివాలయానికి వచ్చి అధికారిక సమీక్ష నిర్వహించడంపై ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తున్నాయని మంత్రులు ఆందోళన చెందుతున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మీనాక్షి నటరాజన్‌ షాడో సీఎంగా చక్కబెడుతున్న పనులతో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందోనన్న చర్చ ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో జోరందుకున్నది.