అమరావతికి కేంద్రం రూ.4,200 కోట్లు విడుదల

అమరావతికి కేంద్రం రూ.4,200 కోట్లు విడుదల
ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజధాని అమరావతి అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం రూ.4,200 కోట్లు విడుదల చేసింది. అమరావతి రాజధాని అభివృద్ధి ప్రాజెక్టు కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి రూ.4,200 కోట్లకు పైగా విడుదల చేసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.  మరికొద్ది రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ అమరావతి పర్యటన చేయనున్న నేపథ్యంలో ఈ నిధులు విడుదలవ్వడం గమనార్హం.

ఇటీవల ప్రపంచ బ్యాంకు నుంచి తొలి విడత రుణం రూ.3,535 కోట్లు వచ్చాయి. వీటికి కేంద్ర నిధులు కూడా తోడు అవ్వడంతో రాజధాని పనులు ఊపందుకోనున్నాయి. గత నెల దాదాపు 70 పనులకు సంబంధించి రూ.40వేల కోట్ల విలువైన నిర్మాణ పనులకు సీఆర్‌డీఏ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.

ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కలిసి అమరావతి రాజధాని నగర దశ-1 అభివృద్ధికి ఒక్కొక్కటి 1600 మిలియన్ల డాలర్లు (రూ.13,600 కోట్లు), 800 మిలియన్ల డాలర్ల నిధులు సమకూర్చడానికి కట్టుబడి ఉన్నాయి. అయితే అభివృద్ధి దశ-1 కోసం కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉన్న రూ.15,000 కోట్లలో మిగిలిన రూ.1,400 కోట్లను కేంద్రం అందిస్తుంది.

అమరావతిలో టెండర్ల ప్రక్రియను దాదాపుగా పూర్తి చేసిన ప్రభుత్వం త్వరలోనే పనులను మొదలుపెట్టనుంది. ఈ నేపథ్యంలో ముందస్తుగా నిధులు ఇవ్వాలంటూ సీఆర్డీఏ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. సీఆర్డీఏ వినతి మేరకు కేంద్ర ప్రభుత్వం ఈ నిధులను విడుదల చేసింది.  ప్రపంచ బ్యాంకు పత్రాల ప్రకారం ఈ ప్రాజెక్ట్ ఈ సంవత్సరం జనవరి 22 నుండి అమల్లోకి వచ్చింది. ప్రోగ్రామ్ అడ్వాన్స్ కోసం 205 మిలియన్ల డాలర్ల మొదటి చెల్లింపు గత నెలలో జరిగింది. ఈ మొత్తం రూ. 15,000 కోట్లలో ప్రపంచ బ్యాంకు, ఎబిడి, కేంద్రం మధ్య భాగస్వామ్యం ఉంది.
మరోవైపు అమరావతి నిర్మాణ పనులను రీలాంఛ్ చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. 2014లోనూ అమరావతి నిర్మా్ణానికి ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆ తర్వాత రాష్ట్రంలో ప్రభుత్వాలు మారటంతో అమరావతి నిర్మాణానికి ఆటంకం ఏర్పడింది. 
 
ఇప్పుడు మరోసారి ఎన్డీఏ కూటమి సర్కారు అధికారంలోకి రావటంతో అమరావతి నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. ఈ నేపథ్యంలోనే అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభోత్సవాన్ని ప్రధాని మోదీ చేతుల మీదుగా చేయనున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ మూడో వారంలో మోదీ ఏపీ పర్యటనకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 
 
ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ పర్యటన షెడ్యూల్ ఇంకా ఖరారు కానప్పటికీ అమరావతిలో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయం వెనుక ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం 250 ఎకరాల్లో ప్రధాని మోదీ కార్యక్రమం నిర్వహించడానికి పనులు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉంది. 
 
ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలతో పాటు వీవీఐపీలు, వీఐపీలు వచ్చి పోయేందుకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం 8 మార్గాలను గుర్తించి, వాటికి ఇంఛార్జిలను కూడా నియమించారు. అయితే ప్రధాని ఏపీ పర్యటన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు విడుదల కావటం విశేషం.