రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరు మాత్రమే బాగా పనిచేస్తున్న ఎమ్యెల్యేలు!

రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఇద్దరు మాత్రమే బాగా పనిచేస్తున్న ఎమ్యెల్యేలు!
 
* ఎమ్యెల్యేల పనితీరుపై పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ స‌ర్వే
 
తెలంగాణలోని 118 మంది ఎమ్యెల్యేలలో బాగా పనిచేస్తున్న 10 మంది జాబితాలో రేవంత్ రెడ్డి మంత్రివర్గంలోని వారిద్దరూ మాత్రమే ఉన్నారు. మొత్తం ఎమ్యెల్యేలో మూడింట రెండు వంతుల మంది `బాగా పనిచేయని’ లేదా `ఓ మాదిరిగా పనిచేస్తున్న’ వారి జాబితాలో ఉన్నారు. ఈ విషయంలో కాంగ్రెస్, ప్రతిపక్ష బిఆర్ఎస్ ఎమ్యెల్యేల పరిస్థితి దాదాపు ఒకేవిధంగా ఉంది.

తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో ఈ ఫలితాలు వెలువడ్డాయి. మార్చి 28 నుండి ఏప్రిల్ 3 వరకు 118 అసెంబ్లీ నియోజకవర్గాలలో (ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ మినహా) సౌత్ ఫస్ట్ వెబ్ పోర్టల్ కోసం పరిశోధనా సంస్థ పీపుల్స్ పల్స్ ఈ సర్వే నిర్వహించింది. 
 
118 మంది ఎమ్మెల్యేలలో, 24 మంది మాత్రమే “బాగా పనిచేస్తున్న వారు”గా గుర్తింపు పొందారు. వారిలో మంత్రులలో  డి శ్రీధర్  బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే `టాప్ 10’లో ఉన్నారు. ఈ సర్వేలో 36 మంది ఎమ్మెల్యేల పనితీరు “చెడు”గా, 58 మంది ఎమ్మెల్యేలను “సగటు”గా రేట్ చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురు పనితీరు బాగుందని, 20 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 37 మంది ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని సర్వేలో వెల్లడైంది. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలలో 12 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, 13 మంది ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, 13 మంది ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వే వెల్లడించింది. 
 
బీజేపీకి సంబంధించి ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఒక  ఎమ్మెల్యే పనితీరు బాగోలేదని, నలుగురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని, ఎంఐంఎం ఎమ్మెల్యేలలో ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగుందని, ఇద్దరు ఎమ్మెల్యేల పనితీరు బాగోలేదని, ముగ్గురు ఎమ్మెల్యేల పనితీరు పర్వాలేదని వెల్లడైంది. సీపీఐకి చెందిన ఒకే ఒక ఎమ్మెల్యే పనితీరు పర్వాలేదని సర్వేలో తేలింది.
 
మాజీ ఆర్థిక మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు టి. హరీష్ రావు అందరికంటే `ఉత్తమ ఎమ్మెల్యే`గా నిలిచారు. మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ 2వ స్థానంలో, మంథని ఎమ్మెల్యే, మంత్రి శ్రీధర్ బాబు 3వ స్థానంలో, ఏఐఎంఐఎం ఫ్లోర్ లీడర్, చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ 4వ స్థానంలో, మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి 5వ స్థానంలో ఉన్నారు.
 
జనగాం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి 6వ స్థానంలో, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కెటి రామారావు 7వ స్థానంలో, బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ 8వ స్థానంలో, హుజూర్ నగర్ ఎమ్మెల్యే, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 9వ స్థానంలో, బీజేపీకి చెందిన కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి 10వ స్థానంలో ఉన్నారు.
 
మహిళా ఎమ్మెల్యేలలో, మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌కు చెందిన సబితా ఇంద్రారెడ్డి మొదటి స్థానంలో ఉండగా, మంత్రి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ 7వ స్థానంలో ఉన్నారు.
 
బీసీ సామాజికవర్గానికి సంబంధించి టాప్ 10 ఎమ్మెల్యేలలో అధికార పార్టీకి చెందిన వారు నలుగురు, ప్రధాన ప్రతిపక్షం టీఆర్ఎస్ కు చెందిన వారు ముగ్గురు, బీజేపీకి చెందిన వారు ముగ్గురు ఉన్నారు. బీసీలకు చెందిన టాప్ 10 ఎమ్మెల్యేలలో బీజేపీకి చెందిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మొదటి స్థానంలో ఉన్నారు. 
 
బీసీ సామాజికవర్గానికి సంబంధించి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే  పొన్నం ప్రభాకర్ 3వ స్థానంలో ఉండగా, ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య 6వ స్థానంలో, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ 8వ స్థానంలో, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి 9వ స్థానంలో ఉన్నారు. 
 
బీసీ సామాజికవర్గంలో బీఆర్ఎస్ చెందిన మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ 4వ స్థానంలో, మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ యాదవ్ 5వ స్థానంలో, మాజీ డిప్యూటీ స్పీకర్, సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి పద్మారావ్ 7వ స్థానంలో ఉన్నారు.  బీసీ ఎమ్మెల్యేలకు సంబంధించి టాప్ 10లో  బీజీపీకి సంబంధించి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ 2వ స్థానంలో, ముధోల్ ఎమ్మెల్యే రామారావు పవర్ 10వ స్థానంలో ఉన్నారు. 
 
ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి, మధిర ఎమ్మెల్యే మల్లు బట్టి  విక్రమార్క మొదటి స్థానంలో ఉన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 2వ స్థానంలో, ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ 3వ స్థానంలో, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీ కృష్ణ 4వ స్థానంలో, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం 5వ స్థానంలో ఉన్నారు. 
 
రాష్ట్ర మంత్రి, ఆందోల్ ఎమ్మెల్యే దామోదర్ రాజనర్సింహా 6వ స్థానంలో, వర్థన్నపేట ఎమ్మెల్యే నాగరాజ్ 7వ స్థానంలో, చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేకానంద 8వ స్థానంలో, స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి 9వ స్థానంలో, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ రావు 10వ స్థానంలో ఉన్నారు.
 
ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్క మొదటి స్థానంలో, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య 2వ స్థానంలో, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు 3వ స్థానంలో, బోథ్ ఎమ్మెల్యే  అనిల్ జాదవ్ 4వ స్థానంలో, వైరా ఎమ్మెల్యే రాందస్ మాలోత్ 5వ స్థానంలో, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు 6వ స్థానంలో, దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్ నేనావత్ 7వ స్థానంలో, ఆసీఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి 8వ స్థానంలో, డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ 9వ స్థానంలో, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు 10వ స్థానంలో ఉన్నారు.