విశాఖ స్టీల్ పునరుద్దరణకు కేంద్ర ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ

విశాఖ స్టీల్ పునరుద్దరణకు కేంద్ర ప్రత్యేక ఆర్ధిక ప్యాకేజీ
విశాఖ స్టీల్ ప్లాంట్‌ను పునరుద్ధరించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఆర్థిక ప్యాకేజీని ప్రకటించే అవకాశం ఉందని  కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించిన ప్రతిపాదనలేవీ ఇప్పటివరకు తమ వద్ద లేవని ఆయన స్పష్టం చేశారు. 
 
గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తు పట్ల ఆందోళన చెలరేగడంతో ప్రైవేటీకరణ ప్రతిపాదనలను నిరసిస్తూ స్థానికంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగాయి. అయితే గత ఏడాది ఏపీలో టిడిపి, జన సేన, బిజెపిలతో కూడిన కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి  విశాఖ స్టీల్‌ ప్లాంట్​ను బలోపేతం చేసే దిశగా కూటమి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేబడుతున్నాయి. 
 
ఈ మేరకు కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ రూపొందించేందుకు అడుగులు వేస్తున్నాయి. దీనిలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో  కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస వర్మ, ఉక్కు శాఖ ఉన్నతాధికారులు సోమవారం సమావేశమై చర్చలు జరిపారు.  ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీ ప్రకటన, అనంతరం పరిణామాలు, ప్లాంట్‌ పురోగతి, బ్లాస్ట్‌ ఫర్నేస్‌లపై వారు చర్చించారు.
ప్లాంట్‌కు ఎస్‌పీఎఫ్‌తో భద్రత కల్పిస్తామన్న ముఖ్యమంత్రికి ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌తో ఏపీ ప్రజలకు భావోద్వేగ అనుబంధం ఉందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.  విశాఖ ఉక్కుకు పూర్వ వైభవం తేవాలని చెబుతూ ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు అందిస్తామని కేంద్ర బృందానికి చంద్రబాబు హామీ ఇచ్చారు.
అయితే, ప్లాంట్‌ నిర్వహణ వ్యయం తగ్గించుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ సందర్భంగా విశాఖ ఉక్కు బలోపేతానికి సంబంధించి కేంద్రం ఎలాంటి చర్యలు చేపడుతోందన్న విషయంపై చంద్రబాబు ఆరా తీశారు.  విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం చేపట్టిన చర్యలను వారు చంద్రబాబుకు వివరించారు. విశాఖస్టీల్ ప్లాంట్‌ను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని, దాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయ సహకారాలను అందించడానికి తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. 
 
స్టీల్‌ ప్లాంట్‌ పురోగతిని క్రమం తప్పకుండా సమీక్షించడం, ప్రస్తుతం పనిచేస్తున్న రెండు బ్లాస్ట్‌ ఫర్నె్‌సలతోపాటు మూడో ఫర్నె్‌సను కూడా తిరిగి ప్రారంభించడం వంటి అంశాలను ప్రతినిధి బృందంతో సీఎం చర్చించారు.  ఉక్కు శాఖ కార్యదర్శి సందీప్ పౌండ్రిక్, సంయుక్త కార్యదర్శి అబిజిత్ నరేంద్ర, ఎన్ఎండీసీ ఎండీ అమితవ ముఖర్జీ, విశాఖ ఉక్కు ఇన్‌ఛార్జీ సీఎండీ అజిత్ కుమార్ సక్సేనా, మెకాన్ సీఎండీ ఎస్కే వర్మ, ఎంఎస్టీసీ సీఎండీ మనోబేంద్ర ఘోషల్ ఈ భేటీలో పాల్గొన్నారు.