నిజమైన ద్రోహులు ఎవరో ప్రజాతీర్పే స్పష్టం చేసింది

నిజమైన ద్రోహులు ఎవరో ప్రజాతీర్పే స్పష్టం చేసింది

* కునాల్‌ కామ్రా నిర్మలా సీతారామన్‌పై పేరడీ సాంగ్

మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ షిండేని లక్ష్యంగా చేసుకుని స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్రాకు పోలీసులు నోటీసులు కూడా జారీ చేశారు. అయినప్పటికీ ఆయన తీరులో మార్పు రాలేదు. ఆయన తాజాగా మరో పేరడీ వీడియో రిలీజ్‌ చేశారు. 

 
ఈసారి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ను ఉద్దేశిస్తూ పాట పాడారు. ‘మిస్టర్‌ ఇండియా’ సినిమాలోని ‘హవా హవాయి..’ పాటను పేరడీ చేశారు. పన్ను చెల్లింపుదారుల సొమ్ము వృథా అవుతోందంటూ అందులో వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌ అవుతోంది.
 
ఇప్పటికే కునాల్ వ్యాఖ్యలపై శివసేన, బీజేపీ శ్రేణులు తీవ్ర విమర్శలు చేస్తుండగా, ఉద్ధవ్‌ థాకరే శివసేన సమర్థిస్తూ వస్తున్నది. షిండేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కునాల్‌ కమ్రా వెంటనే క్షమాపణ చెప్పాలని మహా సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కునాల్‌ కమ్రా చేసిన వ్యాఖ్యల్లో తప్పేముందని, ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహి అంటే తప్పెలా అవుతుందని ఉద్ధవ్‌ శివసేన పార్టీ చీఫ్‌ ఉద్ధవ్‌ థాకరే వ్యాఖ్యానించారు. 
 
ఈ నేపథ్యంలో ఈ వివాదంపై తాజాగా ఏక్‌నాథ్‌ షిండే మహారాష్ట్ర శాసన మండలిలో ప్రసంగిస్తూ ఉద్ధవ్‌ శివసేన, ఇతర ప్రతిపక్ష పార్టీలు రాజ్యాంగం గురించి, వాక్‌ స్వాతంత్య్రం గురించి మాట్లాడుతున్నాయని, గతంలో వాళ్లెందుకు వాళ్లను విమర్శించిన వారిపట్ల కఠినంగా వ్యవహరించారని ప్రశ్నించారు.
 
సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ ఆత్మహత్య నేపథ్యంలో 2020లో నటి కంగనా రనౌత్‌ ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వంపై విమర్శలు చేశారని, అప్పుడు ముంబైలో ఆమె ఇంటిని బుల్డోజర్‌లతో కూల్చివేశారని పేర్కొంటూ  అప్పుడు వాక్‌ స్వాతంత్య్రం గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు. ఉద్ధవ్‌ థాకరే వర్గం శివసేన తనను మాటిమాటికి ద్రోహి అంటుండటంపై ఏక్‌నాథ్‌ షిండే స్పందించారు. 
 
ఎవరు నిజమైన ద్రోహులో ప్రజాతీర్పే స్పష్టం చేసిందని ఎద్దేవా చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఉద్ధవ్‌ శివసేన కంటే తన పార్టీకే ఎక్కువ సీట్లు దక్కడాన్ని ఆయన గుర్తుచేశారు. కాగా, ఏక్‌నాథ్‌ షిండే 2022లో శివసేన నుంచి 40 మంది ఎమ్మెల్యేలను చీల్చి బీజేపీతో చేతులు కలిపారు. దాంతో ఉద్ధవ్‌ థాకరే ప్రభుత్వం కుప్పకూలింది.
 
 ఏక్‌నాథ్‌ షిండే నేతృత్వంలో బీజేపీ, ఏక్‌నాథ్‌ శివసేన సంకీర్ణ సర్కారు ఏర్పాటైంది. అప్పటి నుంచి ఉద్ధవ్‌ థాకరే శివసేన నాయకులు ఏక్‌నాథ్‌ షిండేను ద్రోహి అంటున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల స్టాండప్‌ కమెడియన్‌ కునాల్‌ కమ్రా ఏక్‌నాథ్‌ షిండే పేరును ప్రస్తావించకుండానే ఆయన ద్రోహి అంటూ పాట పాడారు.కాగా, ఈ విషయంలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ హెచ్చరించినా ఏక్‌నాథ్‌ షిండేకు క్షమాపణ చెప్పేందుకు కునాల్‌ కమ్రా నిరాకరించారు. తాను విచారణలో పోలీసులకు సహకరిస్తానని, షిండేకు క్షమాపణ చెప్పేది లేదని తేల్చిచెప్పారు. కాగా ఉద్ధవ్‌ థాకరే శివసేన సుపారీ ఇచ్చి తనపై కునాల్‌ కమ్రాతో కామెంట్స్‌ చేయించిందని ఏక్‌నాథ్‌ షిండే ఆరోపించారు. సుపారీ ఎంత ఇచ్చినా తనను ఏమీ చేయలేరని వ్యాఖ్యానించారు.

మరోవైపు షిండేపై వివాదాస్పద వ్యాఖ్యలకు గానూ ముంబై పోలీసులు కమ్రాకు మరోసారి నోటీసులు పంపారు. అధికారుల ముందు హాజరయ్యేందుకు వారం రోజులు గడువు ఇవ్వాలంటే కమెడియన్‌ చేసిన విజ్ఞప్తిని పోలీసులు నిరాకరించారు. దీంతో బుధవారం ఆయనకు రెండోసారి నోటీసులు జారీ చేశారు. భారతీయ న్యాయ సంహిత (బి) సెక్షన్ 35 కింద ఈ నోటీసులు జారీ చేశారు.