కేరళ బిజెపి నూతన అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్

కేరళ బిజెపి నూతన అధ్యక్షుడిగా రాజీవ్ చంద్రశేఖర్
కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ సోమవారం కేరళ బిజెపి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. పార్టీ కేంద్ర పరిశీలకుడు ప్రహ్లాద్ జోషి బిజెపి రాష్ట్ర మండలి సమావేశంలో ఈ ప్రకటన చేశారు. బిజెపి అధ్యక్ష పదవికి చంద్రశేఖర్ ఆదివారం రెండు సెట్ల నామినేషన్ పత్రాలను బిజెపి ప్రధాన కార్యాలయంలో దాఖలు చేశారు. 
ఈ సందర్భంగా మాట్లాడుతూ కేరళలో ఎన్డీయే కూటమిని అధికారంలోకి తీసుకు రావడమే తన ముందున్న లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ విషయంలో విజయం సాధింపగలనని విశ్వాసం వ్యక్తం చేశారు.  కేరళలో బిజెపి ప్రభావం పెరుగుతుండటాన్నిప్రస్తావిస్తూ, ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పనితీరును చంద్రశేఖర్ ఉదాహరించారు.
 
“బిజెపి ఎల్లప్పుడూ కార్యకర్తల పార్టీ, భవిష్యత్తులో కూడా అలాగే ఉంటుంది” అని ఆయన స్పష్టం చేశారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, అప్పులపై ఆధారపడి రాష్ట్రం ఎంతకాలం మనుగడ సాగించగలదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రం రుణాలపై ఎందుకు ఎక్కువగా ఆధారపడి ఉంది? విద్యార్థులు విద్య కోసం విదేశాలకు ఎందుకు వెళ్లాల్సి వస్తోంద? కొత్త చొరవలు ఎందుకు లేవు? అని ఆయన నిలదీశారు. 
 
“కేరళ అభివృద్ధి స్తంభించిపోయింది. సవాళ్లు మిగిలి ఉన్నాయి. కానీ బిజెపి లక్ష్యం రాష్ట్రాన్ని మార్చడమే. అవకాశాలు లేకుండా, మన యువత నిలిచిపోరు. పెట్టుబడులను ఆకర్షించే, ఉపాధిని సృష్టించే కేరళ మనకు అవసరం” అని ఆయన పేర్కొన్నారు. కేరళలో ఎన్డీఏను అధికారంలోకి తీసుకురావడం పురోగతికి కీలకమని స్పష్టం చేస్తూ, ప్రతి ఇంటికి అభివృద్ధి సందేశాన్ని తీసుకెళ్లాలని చంద్రశేఖర్ పార్టీ కార్యకర్తలను కోరారు.
 
సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురువును ఉటంకిస్తూ  “విద్య ద్వారా పురోగతి, సంస్థ ద్వారా బలం, ప్రయత్నం ద్వారా సుసంపన్నం”  కావించవచ్చని తెలిపారు. 2024 పార్లమెంట్‌ ఎన్నికల్లో తిరువనంతపురం స్థానంలో పోటీ చేసిన చంద్రశేఖర్‌, శశిథరూర్‌ చేతిలో 16 వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
 
చంద్రశేఖర్ నియామకాన్ని ప్రకటించేప్పుడు దిగిపోతున్న పార్టీ అధ్యక్షుడు కె. సురేంద్రన్, కేరళ రాష్ట్రానికి చెందిన ప్రముఖ బిజెపి నాయకులు, కేరళ పార్టీ ఇన్‌ఛార్జీ ప్రకాశ్ జావదేకర్ ఉన్నారు. సురేంద్రన్ తన ప్రసంగంలో గత 10 ఏళ్లలో కేరళలో బిజెపి గణనీయ అభివృద్ధిని సాధించిందని తెలిపారు. రాజీవ్ చంద్రశేఖర్ మూడుసార్లు కర్ణాటక రాజ్యసభ ఎంపీగా పనిచేశారు. 
 
అంతేకాక బిజెపి జాతీయ ప్రతినిధిగా పనిచేశారు. పైగా ఆయన కేరళ ఎన్‌డిఎ యూనిట్‌కు వైస్‌చైర్మన్‌గా ఉన్నారు. గుజరాత్‌లోని కేరళ తల్లిదండ్రులకు ఆయన జన్మించారు. కానీ ఆయన కుటుంబ మూలాలు త్రిస్సూర్‌కు చెందినవి. చంద్రశేఖర్ మామగారు టిపిజి నంబియార్ బిపిఎల్ గ్రూప్ వ్యవస్థాపకుడు.