
2021 నుండి బాలికల విద్యపై కొనసాగుతున్న నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని ఐక్యరాజ్యసమితి (యుఎన్) పిల్లల సంస్థ యూనిసెఫ్ శనివారం ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ పాలకులను కోరింది. తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి విద్యా హక్కును కోల్పోయిన లక్షలాది మంది బాలికల భవిష్యత్తును కాపాడాలని కోరింది.
ఆరవ తరగతి దాటి బాలికలు లేకుండా ఆఫ్ఘనిస్తాన్‌లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనందున యునిసెఫ్ స్పందించింది. దీని వలన 4,00,000 మంది బాలికలు విద్యా హక్కును కోల్పోయారని, మొత్తం 2.2 మిలియన్లకు వారి సంఖ్య చేరుకుందని యునిసెఫ్ తెలిపింది. ప్రపంచంలో మహిళా మాధ్యమిక, ఉన్నత విద్యను నిషేధించిన ఏకైక దేశం ఆఫ్ఘనిస్తాన్ అని పేర్కొంది.
మూడు సంవత్సరాలకు పైగా ఆఫ్ఘనిస్తాన్‌లో బాలికల హక్కులు ఉల్లంఘించబడ్డాయని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేథరీన్ రస్సెల్ ఒక ప్రకటనలో తెలిపారు. బాలికలందరినీ తిరిగి పాఠశాలకు అనుమతించాలని పేర్కొంటూ లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
బాలికల విద్యపై నిషేధం లక్షలాది మంది ఆఫ్ఘన్ బాలికల భవిష్యత్తును దెబ్బతీస్తుందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నిషేధం 2030 వరకు కొనసాగితే నాలుగు మిలియన్లకు పైగా బాలికలు ప్రాథమిక పాఠశాలకు విద్యను పొందే హక్కును కోల్పోతారని ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాలను “విపత్తు”గా ఆమె పరిగణించారు.
More Stories
చైనాపై సుంకాలను తగ్గిస్తామన్న ట్రంప్
ఉగ్రదాడి సమయంలో భారత్ కు ట్రంప్ మద్దతు
శనివారం పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియలు