ఎఐ 90 శాతం కోడ్‌ను రాస్తుంది

ఎఐ 90 శాతం కోడ్‌ను రాస్తుంది

‘ఎఐ 90 శాతం కోడ్‌ను రాస్తుంది’ అని జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. టెక్నాలజీ పరుగులు తీస్తూ సాఫ్ట్‌వేర్‌ రంగంలో కొత్త పుంతలు తొక్కుతోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా, విన్నా ఎఐ ట్రెండ్‌ నడుస్తోంది. మనిషి కనుగొన్న ఎఐ మనిషి స్థానాన్నే భర్తీ చేస్తూ, నిరుద్యోగులుగా రోడ్డున పడేస్తుంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్‌ రంగంలో కోడింగ్‌ కీలకం. 

ఆ కోడింగ్‌లో ఎఐ ప్రాముఖ్యత పెరిగిపోయింది. ఎఐ కోడింగ్‌, టెస్టింగ్‌, ఎగ్జిక్యూటింగ్‌ వంటి కీలక పనులను నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో ఎఐ కోడింగ్‌కు సంబంధించి జోహో వ్యవస్థాపకులు శ్రీధర్‌ వెంబు కీలక వ్యాఖ్యలు చేశారు. కోడింగ్‌లో ఎఐ సామర్థ్యం ఏ మేరకు ఉంటుందో అంచనా వేస్తూ భవిష్యత్తులో దాని పనితీరును విశ్లేషించే ప్రయత్నం చేశారు. ఈ మేరకు తన ఎక్స్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు.

“ఎఐ 90 శాతం కోడ్‌ను రాస్తుందని ఎవరైనా చెప్పినప్పుడు నేను వెంటనే అంగీకరిస్తాను. ఎందుకంటే ప్రోగ్రామర్లు రాసే వాటిలో 90 శాతం బాయిలర్‌ ప్లేట్లు (కాపీ చేసేందుకు వీలుగా ఉండే కంప్యూటర్‌ ప్రోగ్రామ్‌లు). ప్రోగ్రామింగ్‌ రెండు రకాల సంక్లిష్టతను కలిగి ఉంటుంది. ఒకటి-ముఖ్యమైన సంక్లిష్టత. ఇందులో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రణాళికబద్ధంగా కోడింగ్‌ను కొత్తగా క్రియేట్‌ చేయాల్సి ఉంటుంది” అని తెలిపారు. 

“రెండు ప్రమాదవశాత్తు సంక్లిష్టత-ఏదైనా అత్యసవర సమయాల్లో కోడింగ్‌లో సాయం అవసరం అవుతుంది. దాన్ని తొలగించడానికి కృత్రిమ మేధ ఎంతో తోడ్పడుతుంది. అయితే ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ఇప్పటికే మానవులు కనుగొన్న నమూనాల ప్రకారం కోడింగ్‌లో సహకారం అందిస్తుంది. ఇది పూర్తిగా కొత్త నమూనాలు సఅష్టిస్తుందా..? మానవుల మాదిరిగానే ఎఐ చాలా అరుదుగా కొత్త నమూనాలను తయారు చేస్తుందేమో చూడాల్సి ఉంది. ఇది ఏ మేరకు సాధ్యమవుతుందో నాకు తెలియదు” అని పోస్ట్‌ చేశారు.

కాగా, టెక్‌ ఉద్యోగాల్లో చేరేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులు ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) టూల్స్‌ వినియోగంలో ప్రావీణ్యం సాధించాలని ‘చాట్‌ జీపీటీ’ మాతృ సంస్థ ‘ఓపెన్‌ ఏఐ’ సీఈవో శామ్‌ ఆల్ట్‌మన్‌ కీలక సూచన చేశారు. ఇప్పటికే చాలా కంపెనీల్లో కోడింగ్‌ పనుల కోసం కృత్రిమ మేధస్సును ఉపయోగిస్తున్నారని, ప్రస్తుతం అనేక కంపెనీల్లో 50%పైగా కోడింగ్‌ పనులను ఏఐ నిర్వహిస్తోందని ఆయన ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.

 
టెక్‌ ఉద్యోగాల్లో చేరాలనుకునే విద్యార్థులంతా ఏఐతో కలిసి పనిచేయడం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. లేకుంటే జాబ్‌ మార్కెట్‌లో నిలదొక్కుకోవడం కష్టమవుతుందని హెచ్చరించారు. ఏఐలో నైపుణ్యం సాధించిన వారికి దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. మానవ కోడర్ల స్థానంలో ఏఐని ప్రవేశపెట్టాలన్న ఆలోచన నానాటికీ విస్తృతమవుతోందని, దీనికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ప్రాధాన్యమిస్తున్నారని తెలిపారు. 
 
మరో 6 నెలల్లో 90 శాతం కోడింగ్‌ పనులను ఏఐ చేయగలదని, ఈ ఏడాది చివరి నాటికి కోడింగ్‌లో మానవులను ఏఐ పూర్తిగా అధిగమించగలదని ‘ఆంథ్రోపిక్‌’ కంపెనీ సీఈవో అమోడీ వేసిన అంచనాలతో ఆల్ట్‌మన్‌ ఏకీభవించారు.