మంటలను ఆర్పడానికి వెడితే జడ్జ్ ఇంట్లో నోట్ల కట్టలు

మంటలను ఆర్పడానికి వెడితే జడ్జ్ ఇంట్లో నోట్ల కట్టలు
ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగితే ఆ మంటలను ఆర్పడానికి వెళ్లిన అగ్నిమాపక సిబ్బందికి కట్టలకొద్దీ నోట్లు కనిపించాయి. ఈ ఘటన న్యాయవర్గాల్లో సంచలనం సృష్టించింది. ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌ వర్మ బంగ్లాలో ఈ నెల 14వ తేదీన అగ్నిప్రమాదం జరిగింది.  ఆ సమయంలో జస్టిస్‌ వర్మ నగరంలో లేరు.
ఆయన కుటుంబసభ్యులే అగ్నిమాపక సిబ్బంది, పోలీసులకు ఫోన్‌ చేసి పిలిపించారు. వారు అక్కడ అగ్నికీలలను ఆర్పేశాక అక్కడ భారీఎత్తున నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. దీంతో ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు దానిని స్వాధీనం చేసుకున్నారు.  అది మొత్తం లెక్కల్లో చూపని నగదుగా గుర్తించారు. వెంటనే ఈ విషయం ఉన్నతాధికారుల ద్వారా సీజేఐ ఖన్నాకు చేరింది.
దీనిని ఆయన తీవ్రంగా పరిగణించి వెంటనే కొల్లీజియం సమావేశం ఏర్పాటు చేశారు. కొల్లీజియం స్పందించి జడ్జిని అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ చేసింది.  గతంలో వర్మ అలహాబాద్‌ హైకోర్టులోనే పనిచేసి 2021లో ఢిల్లీకి వచ్చారు.  ఐదుగురు సభ్యులున్న కొలీజియంలో కొందరు జస్టిస్‌ వర్మ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించారు. కేవలం బదిలీతోనే న్యాయశాఖ ఇమేజ్‌ తిరిగిరాదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వర్మను రాజీనామా చేయాలని కోరడమో, ఆయనపై సీజేఐ అంతర్గత విచారణ చేపట్టడమో చేయాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.