
* జమ్మూకశ్మీర్ అంశంపై ప్రధాని వ్యాఖ్యలపై పాక్ అభ్యంతరం
చైనా – భారత్ సంబంధాలు, పరస్పరం చర్చల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సానుకూల వ్యాఖ్యలను చైనా స్వాగతించింది. అమెరికన్ పాడ్ కాస్టర్ లెక్స్ ఫ్రిడ్ మాన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మోదీ పలు ప్రశ్నలకు సమాధానమిస్తూ చేసిన వ్యాఖ్యలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. గత అక్టోబర్ లో రష్యాలోని కజాన్ లో చైనా ప్రెసిడెంట్ జీ జిన్ నింగ్ తో జరిగిన సమావేశం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలు మెరుగు పడ్డాయని, అభివృద్ధికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందించిందని మోదీ వివరించారు.
మోదీ ఉభయదేశాల సంబంధాలపై సానుకూలంగా వ్యక్తం చేసిన అభిప్రాయాలపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మావోనింగ్ స్పందించారు. ఉభయ దేశాలు ముఖ్యమైన అంశాలపై అవగాహనతో సానుకూల ఫలితాలు సాధించాయని మావో నింగ్ పేర్కొన్నారు. ఉభయ దేశాల మధ్య 2000 సంవత్సరాలుగా చరిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని, రెండు దేశాలు స్నేహపూర్వక సంబంధాలను ఇక ముందు కూడా కొనసాగిస్తాయని మావో నింగ్ స్పష్టం చేశారు.
భారత, చైనాలకు చెందిన 280 కోట్ల ప్రజల ప్రయోజనాలకు సన్నిహిత సంబంధాలు దోహదపడతాయని, ఉమ్మడి ఆకాంక్షలను నెరవేర్చడం కీలకం కాగలవని తెలిపారు. ప్రపంచ శాంతికి అనుకూలమైన పరిస్థితికి తోడ్పడగలవని ఆమె పేర్కొన్నారు. రెండు దేశాలు ఒకరి విజయానికి మరొకరు దోహదపడే భాగస్వాములుగా ఉండాలని మావో నింగ్ ఆకాంక్షించారు.
2020లో తూర్పు లద్దాక్ లో రెండు దేశాల సైనికుల మధ్య జరిగిన ఘర్షణ తర్వాత తలెత్తిన ఉద్రిక్తతలను తగ్గించడానికి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో ఇటీవల జరిగిన చర్చల కారణంగా సరిహద్దుల్లో సాధారణ పరిస్థితులు తిరిగి ఏర్పడ్డాయని మోదీ పేర్కొన్నారు. ఉభయ నాయకుల మధ్య చక్కటి అవగాహన అమలుకు చైనా 75వ వార్షికోత్సవం చక్కటి అవకాశం కాగలదని చైనా విదేశాంగ ప్రతినిధి మావో నింగ్ వివరించారు.
మరోవంక, జమ్మూ కాశ్మీర్ అంశంపై ప్రధాని వ్యాఖ్యలను పాకిస్తాన్ ఖండించింది. “మోదీ వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేలా, ఏకపక్షంగా ఉన్నాయి. వాటన్నింటిని మేం ఖండిస్తున్నాం” అంటూ పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. “జమ్మూకశ్మీర్ వివాదంపై మోదీ స్పందన సరిగ్గా లేదు. భారత్ వల్లే గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ వివాదానికి పరిష్కారం లభించడం లేదు. ఐక్యరాజ్యసమితికి, పాకిస్తాన్‌కు, కశ్మీరీలకు ఇచ్చిన మాటను భారత్ తప్పుతోంది” అని పాక్ ఆరోపించింది.
“పాకిస్థాన్‌తో శాంతి చర్చలకు మేం(భారత్) ప్రయత్నించినప్పుడల్లా, ఆ దేశం వైపు నుంచి విద్రోహం, విశ్వాస ఘాతుకమే ఎదురయ్యాయి” అని ఆ ఇంటర్వ్యూలో మోదీ వ్యాఖ్యానించారు. “పాకిస్థాన్ గడ్డపై నెలకొన్న అశాంతి వెనుక భారత్ హస్తం ఉంది. జమ్మూకశ్మీర్‌లో కొనసాగుతున్న అరాచకాలకు మోదీ ప్రభుత్వమే కారణం. పాక్‌లో జరుగుతున్న టార్గెటెడ్ హత్యల్లో భారత్ పాత్ర ఉంది. విదేశాల్లో ఉగ్రవాదాన్ని భారత్ పెంచి పోషిస్తోంది” అని పాకిస్తాన్ పేర్కొంది.
More Stories
ప్రకృతితో సమతుల్యతతో జీవించడమే ఆయుర్వేదం
ఆసియాకప్‌లో హద్దుమీరిన పాక్ ఆటగాళ్లు
ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవంకు ముఖ్యఅతిధిగా మాజీ రాష్ట్రపతి