లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ ఏడాదిలో రెండోసారి వియత్నాంకు వెళ్లడంపై బీజేపీ అనుమానాలు వ్యక్తం చేసింది. వియత్నాం అంటే ఆయనకు ఎందుకంత ప్రేమో చెప్పాలని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ శనివారం మీడియాతో మాట్లాడుతూ లోక్సభలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ “రహస్య పర్యటనలు” చేయడం తగదని, అందువల్ల జాతీయ భద్రతకు ప్రమాదం కలగవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు.
“రాహుల్ గాంధీ హోలీ పండుగ సమయంలో వియత్నాంలో ఉన్నట్లు తెలిసింది. నూతన సంవత్సర వేడుకల సమయంలో కూడా ఆయన ఆ దేశంలో ఉన్నారు. ఆయన తన నియోజకవర్గంలో కన్నా వియత్నాంలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. వియత్నాం అంటే అంత ప్రేమ ఎందుకో ఆయన వివరించాలి” అని కోరారు.
రాహుల్ పదే పదే వియత్నాంకు వెళ్తుండటం చాలా ఆసక్తికరంగా ఉందని చెబుతూ మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మరణానంతరం దేశం జాతీయ సంతాప దినాలను పాటిస్తున్న సమయంలో రాహుల్ వియత్నాం వెళ్లారని గుర్తు చేశారు. ప్రతిపక్ష నేతగా ఆయన భారత్లో ఉండాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు.
పార్లమెంట్ సమావేశాలు జరుగుతుండగా రాహుల్ విదేశీ పర్యటనలపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయని బీజేపీ ఐటీ సెల్ చీప్ అమిత్ మాలవీయ వ్యాఖ్యానించారు. ”లోక్సభలో విపక్ష నేతగా ఆయన కీలక స్థానంలో ఉన్నారు. ఆయన తరచు విదేశాలకు వెళ్తుండటం, ముఖ్యంగా పార్లమెంటు సమావేశాలు జరుగుతుండగా రహస్య పర్యటనలు జరపడంలో ఔచిత్యం, జాతీయ భద్రతకు సంబంధించిన అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి” అని అమిత్ మాలవీయ ట్వీట్ చేశారు.
కాగా, రాహుల్ ప్రైవేటు పర్యటనలు బీజేపీ రాజకీయం చేయడాన్ని కాంగ్రెస్ తప్పుపట్టింది. ఒక వ్యక్తిగా ఆయనకు విదేశాలకు వెళ్లే హక్కు ఉందని ఆ పార్టీ నేత ఉదిత్ రాజ్ స్పష్టం చేశారు.

More Stories
సానుకూల మార్పునకు కుత్రిమ మేధ పెద్ద అవకాశం
కేరళలో యుడిఎఫ్, ఎల్డిఎఫ్ ఫిక్స్డ్ మ్యాచ్ త్వరలో ముగింపు
వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా ఎయిర్ మార్షల్ నగేష్ కపూర్