15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల కోట్లు

15 నెలల్లో తెలంగాణ ప్రభుత్వ అప్పు రూ. రూ. 1.52 లక్షల  కోట్లు

ప్రస్తుత శాసనసభ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం అప్పులపై శ్వేతపత్రం సమర్పించే విషయమై ఇరకాటంలో పడినట్లు తెలుస్తున్నది. తమ ఏడాది పాలనలో ఏకంగా రూ. 1.24 లక్షల  కోట్ల అప్పు చేశామని ప్రభుత్వం స్వయంగా అంగీకరించింది. ఈ మేరకు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత అడిగిన ప్రశ్నకు శాసనమండలిలో లిఖిత పూర్వక సమాధానం ఇచ్చింది. రూ. 1.24 లక్షల కోట్లు 2024 నవంబరు 30 వరకు చేసిన అప్పు. 

ఆ తర్వాత డిసెంబరులో రూ. 13,909 కోట్లు, 2025 సంవత్సరంలో జనవరి 1 నుంచి మార్చి 11 వరకు చేసిన మరో రూ. 14,800 కోట్ల అప్పు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు రిజర్వు బ్యాంకు గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రాష్ట్ర ప్రభుత్వ మార్చి వరకు గత 15 నెలల్లో తీసుకున్న అప్పు రూ. 1.52 లక్షల కోట్లు దాటినట్లే భావించాల్సి వస్తుంది.

ఇందులో ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితులకు లోబడి తెచ్చిన బడ్జెట్‌ అప్పులతో పాటు కార్పొరేషన్ల పేర గ్యారెంటీ అప్పులు, గ్యారెంటీలు లేకుండా తెచ్చిన అప్పులు ఉన్నాయి. గత శాసనసభ సమావేశాల్లో ఈ అంశం చర్చకు వచ్చినపుడు కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.1.27 లక్షల కోట్ల అప్పు తెచ్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆరోపించారు. 

తెచ్చిన అప్పులను బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన పాత అప్పుల కిస్తీలు, వడ్డీలకే చెల్లించాల్సి వస్తోందని, వాటికి తోడు కాంట్రాక్టర్ల పాత బిల్లులను చెల్లించాల్సి వస్తోందని ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బదులిచ్చారు. 2023 డిసెంబరు 7న కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే అంతకుముందు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసిన అప్పులపై అసెంబ్లీలో శ్వేతపత్రాన్ని ప్రవేశపెట్టింది.

అప్పటివరకు ఉన్న అప్పుల భారం రూ.6,71,757 కోట్లని తేల్చింది. వాటికితోడు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని క్లియర్‌ చేయాలంటే మరో రూ.40,154 కోట్లు అవసరమని శ్వేతపత్రంలో వెల్లడించింది. ఇలా 2023 డిసెంబరు 20 నాటికి రాష్ట్ర ప్రభుత్వ అప్పులు, చెల్లించాల్సిన బిల్లుల మొత్తం కలిపి రూ.7,11,911 కోట్లుగా నిర్ధారించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అప్పుల దూకుడు కొనసాగింది. మౌలిక సదుపాయాల కల్పనతోపాటు ప్రభుత్వ పథకాలు, ఉద్యోగుల జీత భత్యాల చెల్లింపులు, పాత అప్పుల వడ్డీల చెల్లింపుల కోసం అప్పులు తెస్తున్నారు. కార్పొరేషన్ల పేర బడ్జెట్‌ ఆవల తీసుకుంటున్న అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(టీజీఐఐసీ) ద్వారా సేకరించిన అప్పు రూ.10 వేల కోట్లను మొత్తం ప్రభుత్వమే వినియోగించుకుంది.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా పెడుతున్న ఖర్చు రూ.22,500 కోట్ల వరకు ఉంటే, వస్తున్న ఆదాయం, తెస్తున్న అప్పులు కలిపినా రూ.18 వేల కోట్లు దాటడం లేదు. ఈ విషయాన్ని స్వయంగా ముఖ్యమంత్రే పలు వేదికల మీద చెప్పారు. అంటే ప్రతి నెలా రూ.4,500 కోట్ల మేర ఆర్థిక లోటు ఏర్పడుతోంది. దీనిని పూడ్చుకొనే ప్రయత్నంలో భాగంగా భూములను తనఖా పెట్టి, కార్పొరేషన్లకు గ్యారెంటీలు ఇచ్చి అప్పులు తెస్తున్నారు.

వాటికితోడు కేంద్ర ప్రభుత్వాన్ని అదనపు అప్పు కోసం అభ్యర్థిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలను పునర్‌ వ్యవస్థీకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నారు. కవిత ప్రశ్నకు ప్రభుత్వం ఇచ్చిన సమాధానంలో 2023 డిసెంబరు 7 నుంచి 2024 నవంబరు 30 వరకు ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలో రూ.52,118 కోట్ల అప్పు తీసుకున్నామని వెల్లడించింది. 

కార్పొరేషన్లు తీసుకున్న అప్పులు మరో రూ.61,991 కోట్లు ఉన్నాయని, ఎలాంటి గ్యారెంటీలు లేకుండా మరో రూ.10 వేల కోట్లను కూడా కార్పొరేషన్లు తీసుకున్నాయని వివరించింది. అంటే, రూ.1.24 లక్షల కోట్లన్నమాట. అయితే, ఏఏ కార్పొరేషన్లు ఎంతెంత తీసుకున్నాయన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. పౌర సరఫరాల సంస్థ వంటి కార్పొరేషన్లు ఏటా ధాన్యం సేకరణకు అప్పు తీసుకోవడం, అమ్మిన తర్వాత తిరిగి చెల్లించడం సాధారణంగా జరిగేదే.

 ఆ అప్పులు సాధారణంగా ప్రభుత్వానికి భారం కావు. ఇలాంటి అప్పులు ఎన్ని ఉన్నాయన్నది మాత్రం ప్రభుత్వం వెల్లడించలేదు. గత మూడు నెలల్లో తీసుకున్న అప్పుల్లో టీజీఐఐసీ ద్వారా భూమిని తనఖా పెట్టి తీసుకున్న రూ.10 వేల కోట్లు, తెలంగాణ అర్బన్‌ ఫైనాన్స్‌ అండ్‌ ఇన్‌ఫా్ట్రస్ట్రక్చర్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌(టీయూఎ్‌ఫఐడీసీ) తీసుకున్న రూ.1000 కోట్లు ఉన్నాయి. అన్ని అప్పులు కలిపి రూ.1,52,818 కోట్లకు చేరాయి. బీఆర్‌ఎస్‌ కాలం నాటి పాత అప్పు రూ.6,71,757 కోట్లతో కలుపుకొంటే ప్రస్తుతం రాష్ట్ర అప్పు రూ.8,24,575 కోట్లుగా తేలుతోంది.