తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

తెలుగు రాష్ట్రాల్లో ఏకగ్రీవమైన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ నామినేషన్లు వేసిన 10 మంది అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. 

ఆంధ్రప్రదేశ్‍లో కూటమి పొత్తులో భాగంగా టీడీపీ తరఫున బీటీ నాయుడు, బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ నామినేషన్ దాఖలు చేశారు. అలాగే జనసేన తరఫున నాగేంద్రబాబు, బీజేపీ తరఫున సోము వీర్రాజు నామినేషన్ వేశారు. కాగా, వీరంతా ఏకగ్రీవం అయ్యారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్‌.వనితా రాణి ప్రకటించారు. అలాగే ఎన్నికైన అభ్యర్థులకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.

మరోవైపు తెలంగాణలోనూ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐకి చెందిన ఐదుగురు అభ్యర్థులూ ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటించారు. కాగా, ఎమ్మెల్సీల నామినేషన్ల ఉపసంహరణ గడువు గురువారంతో ముగిసింది. 

ఈ ఎన్నికలకు కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, శంకర్ నాయక్ నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం నామినేషన్లు వేశారు. వీరు కాకుండా ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. అయితే స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు నిబంధనల మేరకు లేకపోవడంతో రిటర్నింగ్‌ అధికారి వాటిని తిరస్కరించారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్, సీపీఐ అభ్యర్థుల ఎన్నిక ఏకగ్రీవమైంది.