తమ లేఖలు పట్టించుకోని టిటిడిపై బిజెపి ఎంపీ ఆగ్రహం

తమ లేఖలు పట్టించుకోని టిటిడిపై బిజెపి ఎంపీ ఆగ్రహం
 
 టీటీడీ అధికారుల తీరు పై బీజేపీ ఎంపీ సీరియస్ అయ్యారు. తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధులు ఇచ్చిన లేఖలను పరిగణలోకి తీసుకోక పోవటంపై  బిజెపి ఎంపీ ఎం రఘునందన్ రావు మండిపడ్డారు. తెలంగాణ నేతల లేఖలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి చదన్రాబాబు నాయుడు సూచించినా, అందుకు సానుకూలంగా టీటీడీ బోర్డు నిర్ణయించినా ఎందుకు పరిగణనలోకి తీసుకోవటం లేదని ఆయన ప్రశ్నించారు.

తిరుమలలో శుక్రవారం శ్రీవారి దర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సిఫార్స్ లేఖలపై త్వరగా టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేస‌వి సెలవుల‌లో తామ భ‌క్తుల‌కు ఇచ్చే లేఖ‌ల‌పై ద‌ర్శ‌నం క‌లిగించాల‌ని స్పష్టం చేశారు. ఏప్రిల్ లోగా పరిస్థితిలో మార్పు రాకుంటే తెలంగాణ ప్ర‌తినిధులంద‌రితో టిటిడి కార్యాల‌యానికి వ‌చ్చి అక్క‌డే తేల్చుకుంటామ‌ని ఆయన హెచ్చరించారు.

తిరుమలలో తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలను పట్టించుకోవటం లేదని ఆ రాష్ట్ర నేతలు కొంతకాలంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వ వినతి మేరకు ఆ రాష్ట్ర ప్రజా ప్రతినిధుల లేఖలను పరిగణలోకి తీసుకోవాలని  ముఖ్యమంత్రి టీటీడీకి సూచించడంతో ఆ మేరకు నిబంధనలు సైతం ఖరారు చేసారు. ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణ ప్రజా ప్రతినిధుల లేఖలు అమలు అయ్యేలా నిర్ణయం తీసుకున్నారు.

దీంతో, తెలంగాణ నుంచి వచ్చే భక్తులకు తిరుమలలో దర్శనం వసతి కోసం ప్రజా ప్రతినిధులు లేఖలు ఇస్తున్నారు. అయినా పట్టించుకోవటం లేదంటూ తెలంగాణ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే క్రమంలో తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి సురేఖ తాజాగా ఏపీ సీఎం చంద్రబాబుకు తాజాగా లేఖ రాసారు.

అయితే, ముఖ్యమంత్రి ఆదేశించిన విధంగా అమలు చేస్తే  తెలంగాణ ప్రజాప్రతినిధులకు రోజుకు 1100 టికెట్లు అదనంగా పెరుగుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే రోజుకు 7500 దర్శనాలు వీఐపీలకు ఇస్తున్నారు. ఇక ప్రజాప్రతినిధుల లేఖలకు 2 వేల వీఐపీ బేక్ దర్శనాలు ఇస్తున్నారు. ప్రస్తుతం రోజూ 75,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటున్నారు. కాబట్టి సహజంగా టీటీడీపై ఒత్తిడి అధికంగా ఉంటుందని వెనుకడుగు వేస్తున్నారు.