రైలు హైజాక్ ఘ‌ట‌న‌లో 27 మంది ఉగ్ర‌వాదులు హ‌తం

రైలు హైజాక్ ఘ‌ట‌న‌లో 27 మంది ఉగ్ర‌వాదులు హ‌తం
పాకిస్థాన్‌లోని బలోచిస్తాన్‌లో జాఫ‌ర్ రైలును హైజాక్ చేసిన ఘ‌ట‌న‌లో 27 మంది ఉగ్ర‌వాదులు హ‌త‌మ‌య్యారు. సుమారు 155 మంది ప్ర‌యాణికుల‌ను ఆ రైలు నుంచి ర‌క్షించారు. మ‌స్క‌ఫ్ ట‌న్నెల్ వ‌ద్ద ఆ రైలును దుండ‌గులు అడ్డుకున్నారు. ట్రాక్‌ను పేల్చిడ్రైవ‌ర్‌ను షూట్ చేసి రైలును ఆపిన విష‌యం తెలిసందే. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆప‌రేష‌న్ కొన‌సాగుతున్న‌ది. 
 
క్వెట్టా నుంచి పెషావ‌ర్ రైలు బ‌య‌లుదేరిన స‌మ‌యంలో దాంట్లో సుమారు 450 మందికిపైగా ప్ర‌యాణికులు ఉన్నారు. తాజా ఆప‌రేష‌న్‌లో ప‌ది మంది భ‌ద్ర‌తా సిబ్బంది కూడా ప్రాణాలు కోల్పోయారు. చివ‌రి మిలిటెంట్‌ను హ‌త‌మార్చే వ‌ర‌కు ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని అధికారులు చెప్పారు.  పంజాబ్‌, సింధ్ ప్రాంతాల నుంచి బ‌లోచిస్తాన్ వెళ్లే అన్ని రైళ్ల‌ను రెస్క్యూ ఆప‌రేష‌న్ వ‌ల్ల ర‌ద్దు చేసిన‌ట్లు పాకిస్థాన్ రైల్వే శాఖ పేర్కొన్న‌ది.
 
బుధవారం ఉద‌యం జాఫ‌ర్ రైలు నుంచి 57 మంది ప్ర‌యాణికుల్ని రెస్క్యూ చేసిన‌ట్లు రైల్వే అధికారులు చెప్పారు. వాళ్ల‌ను క్వెట్టాకు త‌ర‌లించారు. ఇక మ‌రో 23 మంది ప్ర‌యాణికుల్ని మాచ్‌కు పంపించారు.  భ‌ద్ర‌తా ద‌ళాలు రెస్క్యూ ఆప‌రేష‌న్ చేప‌ట్టాక‌, మిలిటెంట్లు చిన్న గ్రూపులుగా విడిపోయార‌ని అధికారులు తెలిపారు.దాడికి పాల్ప‌డిన వ్య‌క్తులు శాటిలైట్ ఫోన్ల‌తో అంత‌ర్జాతీయ కాల్స్ మాట్లాడుతున్న‌ట్లు గుర్తించారు. కొండ‌లు, లోయ ప్రాంతాలు కావ‌డంతో రైలు హైజాక్ అయిన ప్రాంతానికి వెళ్ల‌డానికి భ‌ద్ర‌తా ద‌ళాలు తీవ్ర ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాయి. జాఫ‌ర్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపేందుకు మిలిటెంట్లు ట్రాక్‌ను పేల్చిన‌ట్లు తెలుస్తోంది.  ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఉన్న మాస్ట‌ర్‌మైండ్‌తో రైలు హైజాక్ నిందితులు ట‌చ్‌లో ఉన్న‌ట్లు అధికారులు పేర్కొన్నారు. 

9 బోగీలు వున్నా రైల్లో దాదాపు 500 మంది ప్రయాణికులు వుంటారని రైల్వే కంట్రోలర్‌ తెలిపారు. సొరంగం నెంబరు 8లో రైలును సాయుధులు ఆపేశారు బాంబుల‌తో రైల్వే ట్రాక్‌ను పేల్చిన త‌ర్వాత‌ మ‌స్క‌ఫ్‌ ట‌న్నెల్‌కు స‌మీపంలో రైలు ఆగిపోయిన‌ట్లు పేర్కొన్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌, ఇరాన్ బోర్డ‌ర్ స‌మీపంలో ఉన్న ప‌ర్వ‌త ప్రాంతాల్లో రైలును ఉగ్ర‌వాదులు ఆధీనంలోకి తీసుకున్నారు.

దాదాపు నాలుగు వందల మందిని బందీలుగా పట్టుకున్న బీఎల్​ఏ 30మంది సైనికులను చంపినట్లు పేర్కొంది. రైలులో ఎక్కువగా పాక్‌ సైనికులే ఉన్నట్లు తెలిపింది. తమపై మిలిటరీ ఆపరేషన్‌ చేపడితే బందీలను చంపుతామని బీఎల్ఏ బెదిరించింది. బందీలను విడిచిపెట్టాలంటే బలోచ్‌ రాజకీయ నేరస్థులు, అదృశ్యమైన పౌరులు, కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్‌ చేసింది. అందుకోసం బీఎల్​ఏ 48 గంటల గడువు విధించింది. వెంటనే అప్రమత్తమైన పాక్‌ ప్రభుత్వం సైనిక ఆపరేషన్‌ చేపట్టింది.