ప్రస్తుతం ఉన్న జనరేషన్ మార్పు అనుభవాలను దృష్టిలో పెట్టుకుని భారత కంపెనీలు గ్లోబల్ లీడర్‌లుగా ఎదగాలని, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దేశాభివృద్ధికి తోడ్పడాలని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా, కందిలోని హైదరాబాద్ ఐఐటిలో ఆదివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ముందుగా ‘ఏక్ పే డ్ మాకేనామ్’ పేరిట ఐఐటి ఆవరణలో ఆయన మొక్కను నాటారు. ఆవిష్కరణలు, ఆర్థిక వ్యవస్థ, పలు అంశాలను విద్యార్థులతో ఆయన పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విభిన్న సంస్కృతులు, భాషల నేపథ్యం భారతదేశమని, 5 వేల సంవత్సరాల పూర్వం నుంచి భారతదేశం మేధోపరంగా ఉన్నతంగా ఉందని తెలిపారు.
అభివృద్ధి, ఆవిష్కరణలపై కార్పొరేట్ పెట్టుబడి అవసరాన్ని ప్రాముఖ్యతగా పేర్కొన్నారు. ఐఐటి హైదరాబాద్‌ను ఆలోచన, ఆవిష్కరణ, సాధనలో అగ్రగామిగా నిలిపినందుకు ప్రశంసించారు. ఈ సంస్థ సాంకేతిక పురోగతికి చేసిన గొప్ప కృషిని, భవిష్యత్ నాయకులను తీర్చిదిద్దడంలో దాని పాత్రను కొనియాడారు.
ఇక్కడి 300 మంది ప్రతిభావంతులైన అధ్యాపక బృందాన్ని ప్రత్యేకంగా ప్రశంసించారు. ఐఐటిల శాస్త్రీయ పరిశోధనలతో 20 కోట్ల మంది రైతులు నేరుగా బ్యాంకుల్లో ప్రోత్సాహం పొందుతున్నారని తెలిపారు. పరిశోధనలు, ఆవిష్కరణలతో డి జిటల్ మార్కెటింగ్ అభివృద్ధి చెందిందని పేర్కొంటూ విద్యార్థులు సృజనాత్మకతపై దృష్టి సారించాలని సూచించారు.
ఐఐటి విద్యార్థులు, అధ్యాపకులు తనకు అతిథులని, ఒకసారి పార్లమెంటును సందర్శించాలని కోరారు. చంద్రయాన్ తొలి దశలో విఫలమైనప్పటికీ ఎన్నో సవాళ్లను ఎదుర్కొని విజయవంతం చేశామని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. ఐఐటి విద్యార్థులు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని, వ్యాపారవేత్తలుగా రాణించాలని ఆయన సూచించారు.
హైదరాబాద్ ఐఐటిని సందర్శించడం తనకు ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఉప రాష్ట్రపతి సతీమణి సుదేష్ ధన్‌కర్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మెదక్ ఎంపి రఘునందన్‌రావు, ఐఐటి ఛైర్మన్ మోహన్‌రెడ్డి, ఐఐటి డైరెక్టర్ మూర్తి వేదికపై ఉన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ ఎంపి విజయసాయిరెడ్డి, జిల్లా కలెక్టర్ క్రాంతి, ఎస్‌పి రూపేష్ తదితరులు పాల్గొన్నారు.

More Stories
తెలుగు రాష్ట్రాల జలవివాదాలు పరిష్కారంకు కేంద్రం ఫార్ములా!
వరంగల్ జంట హత్యల కేసులో మరణ శిక్ష
హైదరాబాద్ మెట్రో విస్తరణకు కేంద్రం 50 శాతం, మూసీకి రూ. 3,975 కోట్లు