ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో, దానిని కప్పిపుచ్చుకునేందుకే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం గత పదేళ్లలో తెలంగాణకు రూ. 10 లక్షల కోట్లు ఇచ్చిందని పేర్కొంటూ రేవంత్ రెడ్డి మీద కోపంతో తెలంగాణ అభివృద్ధిని ఎందుకు అడ్డుకుంటామని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత వారం రోజులుగా బీజేపీపైనా, వ్యక్తిగతంగా తనపైనా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణకు ప్రాజెక్టులు, నిధుల కేటాయింపును అడ్డుకుంటున్నానని తనపైన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని స్పష్టం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 14 నెలలు అవుతోందని, అభయ హస్తం పేరుతో ఆరు గ్యారంటీలు, హామీలు ఇచ్చి విస్మరించిందని విమర్శించారు.
కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం అవుతోందని, తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి మాటలను పట్టించుకోవడం లేదని చెప్పారు. తాను సిద్ధాంతానికి, విలువలకు కట్టుబడి ఉండే వ్యక్తినని, సీఎం వైఫల్యాలు, అసమర్థతను తనపైన రుద్దితే సహించబోనని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నపుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రాజెక్టులకు కేటాయింపులు చేయాలని సూచించారు.
రీజినల్ రింగ్ రోడ్డుకు ప్రధానిని తానే ఒప్పించానని, రీజినల్ రింగ్ రోడ్డు తొలి ఫేజ్‌కు త్వరలోనే నిధులు విడుదల అవుతాయని తెలిపారు. అలాగే దక్షిణాదిలో లోక్‌సభ సీట్లు తగ్గుతాయని గగ్గోలు పెడుతున్నారని, సీట్లు తగ్గిస్తామని కేంద్రం చెప్పిందా లేదా మోదీ, అమిత్ షా చెప్పారా? అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి, కేసీఆర్ పాత మిత్రులని, కేసీఆర్ కాంగ్రెస్‌తో కలిసి పని చేశారని గుర్తు చేశారు. ఎస్ఎల్బీసీ దగ్గర పనులు జరుగుతుంటే వెళ్లి రాజకీయాలు చేయవద్దని హితవు పలికారు.

More Stories
భారత్ అండర్ -19 జట్టు కెప్టెన్ గా హైదరాబాద్ కుర్రాడు
నాగార్జునకు కొండా సురేఖ క్షమాపణలు
21న సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరుకానున్న జగన్!