ఏపీ బడ్జెట్ లో విద్య, వైద్యం, పంచాయతీరాజ్ లకు పెద్దపీట

ఏపీ బడ్జెట్ లో విద్య, వైద్యం, పంచాయతీరాజ్ లకు పెద్దపీట
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్‌ ప్రజాహితంగా ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి తెలిపారు. విద్య, వైద్యం, పంచాయతీరాజ్‌ శాఖలకు పెద్దపీట వేశారనిచెప్పారు. ఐదేళ్ల కాలంలో విచ్చిన్నమై అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం ఆది నుంచి తగిన సహకారం అందిస్తోందని ఆమె పేర్కొన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన 2025-26 బడ్జెట్‌ ప్రజా హితంగా ఉంది. గతంలో స్కాములు మాత్రమే ఉండేవి. ఇప్పుడు స్కీములు అమలవుతున్నాయి” అని ఆమె కొనియాడారు.  తమ పార్టీ ఎమ్మెల్యేలు బడ్జెట్‌ చర్చల్లో పాల్గొని తమ వాణి వినిపిస్తారని ఆమె తెలిపారు.

 
విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గం పరిధిలోని అమ్మ ఆసుపత్రి వైద్యులు దుర్గా శ్రీలక్ష్మి, పవన్ కుమార్‌తోపాటు చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ శ్రీదేవిలకు స్థానిక ఎమ్మెల్యే సుజనా చౌదరి సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన పురందేశ్వరి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. 
 
ఈ సందర్భంగా పురందేశ్వరి మాట్లాడుతూ ప్రజల సమస్యలపై నిర్మాణాత్మకంగా తమ పార్టీ సభ్యులు ప్రస్తావిస్తారని చెప్పారు. 11 ఏళ్ల మోదీ పాలనలో కేంద్ర ప్రభుత్వం మచ్చలేని పాలన అందిస్తోందని ఆమె తెలిపారు.  ఇటీవల ఇండియా టుడే నిర్వహించిన సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే బీజేపీ 52 శాతం ఓట్లు సాధిస్తుందని వెల్లడైనట్లు ఆమె గుర్తు చేశారు. పార్టీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ వారి ఆశీర్వాదానికి నిదర్శనమని చెప్పారు. 
 
ఆర్ధికంగా చితికిపోయిన రాష్ట్రాన్ని పునర్‌ నిర్మించే దిశగా బడ్జెట్‌ ఉందని ఆదోని ఎమ్మెల్యే డాక్టరు పార్థసారథి తెలిపారు. ఇది దిద్దుబాటు బడ్జెట్‌గా పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తున్నా సాయం తీసుకునేందుకు తమ వాటా నిధులు ఇవ్వలేని స్థితిలో గత ప్రభుత్వ పాలన ఉందని ధ్వజమెత్తారు. కాని ఇప్పుడు ఆగిన ఆ 74 పథకాలకు ఈ బడ్జెట్‌లో కేటాయింపులు చేశారని తెలిపారు.