హమాస్ దాడి చేస్తుందనుకోలేదు.. హమాస్ పై తక్కువ అంచనా 

హమాస్ దాడి చేస్తుందనుకోలేదు.. హమాస్ పై తక్కువ అంచనా 
 
* ఇజ్రాయిల్ సైనిక దర్యాప్తు నివేదిక వెల్లడి

2023 అక్టోబర్‌ 7 నాటి ఘటనకు ముందు హమాస్‌ సామర్ధ్యాలను తక్కువ అంచనా వేసినట్లు ఇజ్రాయెల్‌ ఆర్మీ తెలిపింది. నాటి ఘటనలో తమ దేశ పౌరులను రక్షించుకోవడంలో విఫలమైనట్లు అంగీకరించింది. తాజాగా నాటి ఘటనపై ఐడీఎఫ్‌ దర్యాప్తు  నివేదికను విడుదల చేసింది. అందులో కీలక విషయాలను వెల్లడించింది. 

హమాస్‌ పూర్తిస్థాయి యుద్ధానికి సిద్ధంగా లేదని తాము భావించామని, ఒక వేళ పరిస్థితులు మారినట్లు కనిపిస్తే అందుకు సిద్ధంగా ఉండడానికి తమకు సమయం దొరికేదని ఐడీఎఫ్‌ వెల్లడించింది. అయితే హమాస్‌ దాడి చేస్తుందని అనుకోలేదని, అనూహ్య దాడితో తాము దాన్ని ఎదుర్కోవడానికి సమయం దొరకలేదని పేర్కొంది. 

గాజా స్ట్రిప్‌లో జీవన పరిస్థితులను మెరుగుపరచడం ద్వారా యుద్ధం చేయాలనే ఆలోచన నుంచి హమాస్‌ను దారి మళ్లించవచ్చని భావించినట్లు తెలిపింది. ఇజ్రాయెల్‌ చేపట్టిన ఈ దర్యాప్తు అక్టోబర్‌ 7 నాటి ఘటనకు ముందు, తర్వాత పరిస్థితులపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ముఖ్యంగా ఐడీఎఫ్‌ వ్యూహాలు, యుద్ధ సన్నద్ధత, ఇంటెలిజెన్స్‌కు సంబంధించిన అంశాలను దర్యాప్తును పరిశీలించింది.

2023 అక్టోబర్‌ 7నాటి ఘటనలో ఊహకందని రీతిలో హమాస్‌ మిలిటెంట్లు ఒక్కసారిగా ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డారు. ఈ ఘటనలో సుమారు 1200 మందికిపైగా ఇజ్రాయెల్‌ పౌరులు మరణించారు. 250 మందికిపైగా హమాస్‌ చేతిలో బందీలుగా చిక్కుకున్నారు. 

దీంతో గాజాపై ఇజ్రాయెల్ ప్రతీకార దాడులు జరిపింది. హమాస్‌ అగ్రనేతలతో సహా, మిలిటెంట్లు లక్ష్యంగా గాజా స్ట్రిప్‌లో వైమానిక, భూతల దాడులు జరిపింది. దీంతో హమాస్‌ అధినేత యహ్యా సిన్వర్‌తో సహా వేల మంది మిలిటెంట్లు మరణించారు. 48,000 మంది పౌరులు మరణించినట్లు పాలస్తీనా ఆరోగ్య విభాగం ప్రకటించింది. ఈ యుద్ధంలో 400 మందికి పైగా ఇజ్రాయెల్‌ సైనికులు చనిపోయారు.

గాజా కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇజ్రాయెల్, హమాస్ మధ్య రెండో దశ చర్చలు ప్రారంభమయ్యాయని ఈజిప్ట్ తెలిపింది. ఇజ్రాయెల్, ఖతార్, యూఎస్ అధికారులు కైరోలో కాల్పుల విరమణ ఒప్పందం రెండో దశపై తీవ్రమైన చర్చలు ప్రారంభించారని పేర్కొంది. కాగా, ఆరు వారాల తొలి దశ కాల్పుల విరమణ శనివారంతో ముగియనుంది.

తమ చెరలో వున్న నలుగురు బందీల మృతదేహాలను హమాస్‌, గురువారం తెల్లవారు జామునే రెడ్‌క్రాస్‌కు అప్పగించింది. మరోవైపు ఇజ్రాయిల్‌ జైళ్ళ నుండి వందలాదిమంది పాలస్తీనా ఖైదీలు విడుదలయ్యారు. మొదటి దఫా కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా ఇరు పక్షాలు నిబంధనలకు అనుగుణంగా తమ విధులను నిర్వర్తించాల్సి వుంది. 
 
ఇప్పటివరకు హమాస్‌ 33 మంది బందీలను అప్పగించగా, వీటిలో 8 మృత దేహాలు వున్నాయి. కాగా ఇజ్రాయిల్‌ దాదాపు 2 వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. కాగా మృతదేహాల గుర్తింపు ప్రక్రియను కూడా పూర్తి చేసినట్లు ఇజ్రాయిల్‌ అధికారులు వెల్లడించారు. 
 
ఇజ్రాయల్‌ జైళ్ళ నుండి 456 మంది పాలస్తీనియన్లు విడుదల కాగా, వారిలో 97 మందిని ఈజిప్ట్‌కు తరలించారు. 37 మంది వెస్ట్‌ బ్యాంక్‌ చేరుకున్నారు. మరో ఐదుగురు ఆక్రమిత తూర్పు జెరూసలేం వెళ్ళారు. 24మంది చిన్నారులతో సహా మరికొంతమంది ఇంకా విడుదల కావాల్సి వుందని వారి విడుదల ప్రక్రియలో ఇజ్రాయిల్‌ కావాలనే జాప్యం చేస్తోందని హమాస్‌ విమర్శించింది. 
 
కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ గత 48 గంటల్లో గాజా ఆస్పత్రులకు 17 మృతదేహాలు వచ్చాయి. 19 మంది గాయపడినవారు చికిత్స పొందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ వర్గాలు తెలిపాయి. రెండో దఫా కాల్పుల విరమణ చర్చల కోసం కైరోకు వెళ్ళాల్సిందిగా ఇజ్రాయిల్‌ ప్రధాని నెతన్యాహు తమ ప్రతినిధి బృందాన్ని ఆదేశించారని ప్రధాని కార్యాలయం తెలిపింది. 
 
కాగా, రెండో దశ ఒప్పందం కుదుర్చుకునే విషయంలో ఇజ్రాయిల్‌ చిత్త శుద్ధితో వ్యవహరించడం లేదని హమాస్‌ పొలిట్‌బ్యూరో సభ్యులు బసీమ్‌ నయీమ్‌ విమర్శించారు. బదులుగా సైనిక దాడులను ముమ్మరం చేయాలని భావిస్తోందని ఆరోపించారు. గాజాకు ఈజిప్ట్‌తో గల సరిహద్దు పొడవునా గల ఫిలడెల్ఫి కారిడార్‌ నుండి ఇజ్రాయిల్‌ మిలటరీ వైదొలగేది లేదని ఇజ్రాయిల్‌ మీడియా వర్గాలు స్పష్టం చేశాయి.  
 
ఆయుధాల అక్రమ రవాణాను నిరోధించేందుకు తమ సైన్యాలు ఇక్కడే ఉండాలని చెప్పారు. ఈజిప్టు సరిహద్దుల్లో గాజా వైపు ఈ ప్రాంతం ఉంది. ఈ కారిడార్‌లో బఫర్‌ జోన్‌ను కొనసాగించేందుకు ఇజ్రాయెల్‌ ప్రయత్నిస్తే, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లేనని హమాస్‌ హెచ్చరించింది.