రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌

రూ. 3.22 లక్షల కోట్లతో ఏపీ వార్షిక బడ్జెట్‌
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం తొలిసారిగా పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను శాసనసభలో మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టారు. రూ.3 లక్షల 22 వేల కోట్ల అంచనా వ్యయంతో బడ్జెట్‌ను సభ ముందుకు తీసుకొచ్చారు. ఇందులో వ్యవసాయానికి రూ.48 వేల కోట్లు కేటాయించారు. 
 
రెవెన్యూ వ్యయం రూ.2,51,162 కోట్లు, మూలధన వ్యయం అంచనా రూ.40,635 కోట్లు, రెవెన్యూ లోటు రూ.33,185 కోట్లు, ద్రవ్యలోటు రూ.79,926 కోట్లుగా అంచనా వేశారు. ఎన్నికల హామీల అమలుకు తాము కట్టుబడి ఉన్నామని ఏపీ ప్రభుత్వం తాజా బడ్జెట్ ద్వారా స్పష్టంగా చెప్పింది. సూపర్ సిక్స్, మేనిఫెస్టో హామీలు, అభివృద్ధి పనులకు ఎక్కువ కేటాయింపులు జరపడంతో 2025-56 ఏపీ బడ్జెట్ తొలిసారిగా రూ.3 లక్షల మార్కును దాటింది. 
 
తొలిసారిగా తెలుగు భాషాభివృద్ధికి ఏకంగా రూ.10 కోట్ల నిధులు కేటాయించామని వెల్లడించారు.  గతేడాది రూ. 2.94. లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టగా ఈసారి బడ్జెట్‌ రూ.3 లక్షల 22 వేల 359 కోట్లకు చేరింది. వ్యవసాయ రంగానికి భారీగా కేటాయింపులు పెరిగాయి. అన్నదాతల కోసం కూటమి ప్రభుత్వం ఈసారి రూ.48,340 కోట్లను కేటాయించింది. గతేడాది బడ్జెట్ రూ. 43,402.33 కాగా ఈసారి కేటాయింపులు భారీ స్థాయిల పెరిగాయి. 
 
మూలధనం అంచనా వ్యయం రూ.40,635 కోట్లు గతంలో ఇది రూ. 32,712 కోట్లుగా ఉంది. ఈసారి ద్రవ్యలోటు రూ.79,926 కోట్లు ఉండవచ్చని అంచనా వేసింది.  రాజధానిని పట్టాలెక్కిస్తున్నామని చెప్పిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్.. ఈ బడ్జెట్ అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్‌ వైద్య భరోసాకు రూ.31,613 కోట్లు కేటాయించారు. తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, బీసీ సంక్షేమానికి రూ.23,260 కోట్లు, వైద్యారోగ్య శాఖకు రూ.19,260 కోట్లు కేటాయించారు. 
 
గత బడ్జెట్‌లో పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధికి రూ.16,739 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు రూ.18,848 కోట్లకు చేరాయి. మూల ధన అంచనా వ్యక్తం రూ.32,712 కోట్లు నుంచి రూ.40,635 కోట్లకు పెరిగింది. జలవనరుల అభివృద్ధి బడ్జెట్ రూ.16,705 కోట్ల నుంచి రూ.18,020 కోట్లకు పెరిగింది. పాఠశాల విద్యకు గతంలో రూ. 29,909కోట్లు ఈసారి కేటాయింపులు రూ.31,806 కోట్లకు చేరాయి. 
 
గత బడ్జెట్‌లో పరిశ్రమలు వాణిజ్యం రూ. 3,127కోట్లు కాగా ఈసారి రూ.3,156 కోట్లు కేటాయించారు. యువజన, సాంస్కృతిక శాఖకు గతంలో 322కోట్లు కాగా ఈమారు రూ.469 కోట్లకు పెంచారు. పోలవరానికి రూ.6,705 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమానికి గత బడ్జెట్‌లో రూ.39007 కోట్లు కేటాయించగా ఈసారి నిధులను రూ.47,456 కోట్లకు పెంచారు. 
 
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి వరుసగా గతంలో రూ.18497 కోట్లు, రూ.7557 కోట్లు కేటాయించగా ఈసారి కేటాయింపులు ఎస్సీలకు రూ.20,281 కోట్లు, ఎస్టీ సంక్షేహానికి రూ.8,159 కోట్లకు చేరాయి. ప్రకృతి సేద్యం ప్రోత్సాహానికి రూ.62 కోట్లు, ఇరిగేషన్‌ ప్రాజెక్టులకు రూ. 11,314 కోట్లు, మత్స్యకార భరోసాకు రూ.450 కోట్లను కూటమి ప్రభుత్వం కేటాయించింది. 
 
ఆదరణ పథకం కోసం రూ.1000 కోట్లు, మనబడి పథకం కోసం రూ.3,486 కోట్లు, తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లు, దీపం 2.0 పథకానికి రూ.2,601 కోట్లు కేటాయించింది.