చివరిరోజు మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు

చివరిరోజు మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు
మహాశివరాత్రి సందర్భంగా మహా కుంభమేళాలో  ఆరోది, చివరిదైన అమృత స్నానం ఆచరించేందుకు కోట్లాది మంది భక్తులు త్రివేణి సంఘమానికి తరలివస్తున్నారు. దీంతో గంగానదీ తీరం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఇప్పటికే ప్రయాగ్‌రాజ్‌ చేరుకున్న భక్తులు బుధవారం తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. 
 
పవిత్ర స్నానాలు చేయడానికి వచ్చిన భక్తులపై హెలికాప్టర్ల ద్వారా పూల వర్షం కురిపించారు. ఇక బ్రహ్మ ముహుర్తంలో స్నానం కోసం అర్ధరాత్రి నుంచే భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ముహూర్తం సమీపించే వరకూ ఓపిగ్గా వేచి చూశారని తెలిపాయి. కొందరు ముహూర్తానికంటే ముందే పుణ్య స్నానం చేశారని కూడా వెల్లడించాయి.
 
ఆరు వారాలుగా జరుగుతున్న మహా కుంభమేళా మరికొన్ని గంటల్లో ముగియనుంది. ఈ నేపథ్యంలో పుణ్య స్నానాలకు పెద్ద సంఖ్యలు భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనా వేస్తున్నది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భారీగా ఏర్పాట్లు చేసింది. ప్రయాగ్‌రాజ్‌ను నో వెహికిల్‌ జోన్‌గా ప్రకటించింది.
 
కుభమేళాలో పుష్య పూర్ణిమ (జనవరి 13), మకర సంక్రాంతి (జనవరి 14), మౌని అమావాస్య (జనవరి 29), వసంత పంచమి (ఫిబ్రవరి 3), మాఘ పూర్ణిమ (ఫిబ్రవరి 12), మహాశివరాత్రి (ఫిబ్రవరి 26) ప్రత్యేక తేదీలుగా ప్రకటించారు. ఆయ రోజుల్లో భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించారు. కాగా, మంగళవారం 1.33 కోట్ల మంది భక్తులు త్రివేణీ సంగమంలో స్నానాలు చేయగా, ఇప్పటివరకు 64 కోట్ల మంది భక్తులు పాల్గొన్నారని ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం వెల్లడించింది. ఇక మంగళవారం త్రివేణి సంగమంతో పాటు ఇతర ఘాట్‌లల్లో దాదాపు 1.33 కోట్ల మంది పవిత్ర స్నానాలు ఆచరించారు

భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. కుంభమేళా ప్రాంతాన్ని ‘నో వెహికిల్‌ జోన్‌’గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి ఉత్తర్వులు అమల్లోకి తీసుకొస్తున్నట్టు తెలిపింది. ఎంట్రీ పాయింట్‌ సమీపంలోని స్నాన వాటికల వద్దే భక్తులు పుణ్య స్నానాలు చేయాలని, తాజా గైడ్‌లైన్స్‌ పాటించాలని అధికారులు కోరారు. 
 
భక్తులు వచ్చే మార్గాలకు అనుగుణంగా వారికి సమీపంలో ఉండే ఘాట్లని సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తైన వెంటనే భక్తులు ఘాట్లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.  త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉత్తరప్రదేశ్‌ ఆర్టీసీతోపాటు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. 
 
ప్రయాగ్‌రాజ్‌ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఆర్టీసీ 4,500 బస్సులను నడుపుతున్నది. మహాకుంభమేళా ప్రాంతం నుంచి సమీపంలోని బస్టాండ్లకు తరలించేందుకు ఉచితంగా 750 షటిల్‌ బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వేశాఖ కూడా భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు 350 రైళ్లు నడుపుతున్నది.