ఉక్రెయిన్, రష్యా యుద్ధం మొదలై మూడేళ్లు అవుతోంది. 36 నెలలుగా ఇరుదేశాల మధ్య భీకర పోరులో ఇరువైపుల వేలాది మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. భీకర గగనతల, భూతల దాడుల్లో ఉక్రెయిన్‌లో సాధారణ ప్రజల కలల సౌధాలు పేకమేడల్లా కూలి నేలమట్టమయ్యాయి. పెద్ద మొత్తంలో మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి.
అధునాతన ఆయుధాలతో పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. ఎక్కడ చూసినా మృత్యువు విలయతాండవం చేస్తోంది. గ్రామాలు, పట్టణాలన్నీ మరుభూములుగా మారిపోయాయి. ఇళ్లు, పెద్ద పెద్ద భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. ఏళ్ల తరబడి శ్రమించి సాధించిన ప్రగతి ఫలాలు కళ్ల ముందే కనుమరుగైపోయాయి.
ఈ యుద్ధంలో రష్యా కంటే ఉక్రెయిన్ ఎక్కువగా నష్టపోయింది. ఆర్థికంగా, సైనికంగా చితికిపోయినా రష్యాకు తలవంచకుండా అస్థిత్వమే లక్ష్యంగా ఉక్రెయిన్ పోరాడుతోంది. పవర్‌హౌస్ రష్యాను నిలువరించేందుకు మిత్ర దేశాల సాయంతో ఉక్రెయిన్ తన సర్వశక్తులూ ఒడ్డి పోరాడుతోంది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్(నాటో)లో చేరాలన్న ఉక్రెయిన్ ఆలోచనలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న రష్యా.. 2022 ఫిబ్రవరి 24న ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు ప్రత్యేక సైనిక చర్యకు దిగడంతో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.
అధికారిక లెక్కలు తెలియకపోయినా, ఈ మూడేళ్లలో ఇరువైపులా సుమారు 2 లక్షల మంది మరణించినట్లు ఓ అంచనా. ఈ పోరు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఉక్రెయిన్‌లో జీవన వ్యయాన్ని భారీగా పెంచింది. అంతర్జాతీయంగా తగ్గిన వాణిజ్యంతో ఉక్రెయిన్ నష్టాలు చరిత్రలో ఎన్నడూ చూడని స్థాయికి చేరుకున్నాయని ఆర్థికవేత్తలు చెబుతున్నారు.
దాడుల్లో ఆనకట్టలు, రహదారులు, భవనాలు, వ్యవసాయ క్షేత్రాలు, పాఠశాలలు, కర్మాగారాలు ఇలా మౌలిక వసతుల వ్యవస్థ బాగా దెబ్బతింది. ఎన్నో రంగాలు తిరోగమనంలో పయనిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగి నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటాయి. ఈ ఏడాది జనవరి నాటికి ఉక్రెయిన్‌లో ద్రవ్యోల్బణం 13 శాతానికి పెరిగింది.
అమెరికా వైఖరిలో మార్పు
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం యుద్ధం పట్ల అమెరికా వైఖరిలో వచ్చిన మార్పు ఉక్రెయిన్‌తోపాటు ఇతర యూరోపియన్ దేశాలను ఆందోళనకు గురిచేస్తోంది. గత అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వం ఉక్రెయిన్‌కు సైనిక, ఆర్థిక, మానవతా సహాయంగా 119 బిలియన్ డాలర్లకు పైగా సహాయాన్ని అందచేసింది. అయితే బైడెన్ మాదిరి ట్రంప్ నుంచి సహకారం ఉక్రెయిన్‌కు లభించే అవకాశం కనపడడం లేదు.
యుద్ధాన్ని ముగించే ప్రక్రియ ప్రారంభానికి ముందుగానే రష్యాతో యుద్ధ ఖైదీల సంపూర్ణ మార్పిడి పూర్తి కావాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సోమవారం ప్రతిపాదించారు. కీవ్‌లో జెలెన్‌స్కీ ప్రసంగిస్తూ, యుద్ధ ఖైదీలందరినీ విడుదల చేయడానికి ఉక్రెయిన్ సిద్ధంగా ఉందని ఆయన ప్రకటించారు. సంపూర్ణంగా యుద్ధ ఖైదీల విడుదల జరగాలని, రెండు దేశాలకూ వర్తించాలని ఆయన ప్రతిపాదించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం అంకెల్లోn 152,295 మంది- యుద్ధంలో మరణించిన రష్యన్లు, ఉక్రెయినియన్లు (సైనికులు, సాధారణ పౌరులు సహా)
మౌలిక సదుపాయాలకు దాదాపు 170 బిలియన్ యూఎస్ డాలర్ల ప్రత్యక్ష నష్టం జరిగినట్లు కీవ్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ తెలిపింది. 2022లో యుద్ధం మొదలైన రోజు నుంచి ఉక్రెయిన్‌లో వందల సంఖ్యలో కంపెనీలు నష్టపోయాయని పేర్కొంది. ముఖ్యంగా ఉక్రెయిన్ ఆదాయానికి కీలక వనరుగా ఉన్న మెటలర్జికల్ పరిశ్రమ రంగం భారీగా నష్టాన్ని చూసింది. ఇప్పుడు ఈ రంగాన్ని పునరుద్ధరించడం అసాధ్యంగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తమవుతోంది.
మరోవంక, తమ భూభాగం నుంచి రష్యా బలగాలు తక్షణమే వైదొలగాలని కోరుతూ ఉక్రెయిన్ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ అమోదించింది. ఈ తీర్మానంపై సోమవారం రాత్రి ఓటింగ్ జరిగింది. మరోవైపు, ఉక్రెయిన్ సమస్యను త్వరగా పరిష్కరించే ఉద్దేశంతో రష్యాతో అకస్మాత్తుగా ట్రంప్ చర్చలు జరపడంతో అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య విభేదాలు, ఉద్రిక్తతలు తలెత్తాయి.
మాస్కోతో సంబంధాలపై ట్రంప్ ప్రభుత్వ అసాధారణ రీతిలో వైఖరిని మార్చుకోవడంతో యూరప్ కూటమితో కూడా అమెరికాక సంబంధాలు ఇబ్బందుల్లో పడ్డాయి. గత వారంలో జరిగిన ప్రాధమిక చర్చల్లో తమను, ఉక్రెయిన్‌ను బహిష్కరించారంటూ యురోపియన్ నేతలు ఆగ్రహంగా ఉన్నారు.
ఈ యుద్ధం ఉక్రెయిన్ ప్రజలపై మానసికంగా తీవ్ర ప్రభావం చూపినట్లు నిపుణులు చెబుతున్నారు. చాలా మంది ఉక్రెయిన్ పౌరులు మానసిక ఒత్తిడికి గురైనట్లు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అనేక మంది డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలతో బాధపడుతున్నారని చెప్పారు. ఉక్రెయిన్ జనాభాలోని దాదాపు 55 శాతం మంది ప్రజలు మానసిక నిపుణులను సంప్రదించినట్లు పేర్కొన్నారు.
దీని నుంచి బయటపడడానికి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంటున్నారు. దాదాపు 71 శాతం మంది ఉక్రెయిన్ పౌరులు శాంతి కోసం ఎదురు చూస్తున్నారు. మరోవైపు 2022లో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఉక్రెయిన్ దాదాపు 11 శాతం భూభాగాన్ని కోల్పోయింది. 2014 నుంచి చూసుకుంటే దాదాపు 18 శాతం ఉక్రెయిన్ భూభాగాన్ని రష్యా ఆక్రమించుకుంది. అటు దాదాపు 60 లక్షల మందికి పైగా ఉక్రెయిన్ పౌరులు తమ దేశాన్ని వదిలి విదేశాలకు వలస వెళ్లారు.
More Stories
రూ. 1 లక్ష కోట్లతో ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తొలి బడ్జెట్
నాపై సెటైర్లు వేయడానికి కమ్రా సుపారి తీసుకున్నట్లుంది
కెనడా ఎన్నికల్లో భారత్ జోక్యం చేసుకునే అవకాశం!