పురోగతి లేని రైతులతో చర్చలు

పురోగతి లేని రైతులతో చర్చలు
పంటల కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీతో సహా తమ డిమాండ్లపై వ్యవసాయ సంఘాలు మొండిగా ఉండటంతో, నిరసన తెలుపుతున్న రైతులకు, ముగ్గురు మంత్రులతో కూడిన కేంద్ర బృందానికి మధ్య శనివారం సాయంత్రం జరిగిన జరిగిన చర్చలలో ఎటువంటి పురోగతి సాధించలేకపోయారు. మార్చి 19న మరిన్ని చర్చలు జరపాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి.

అయితే, పంటల కనీస మద్దతు ధరలకు చట్టబద్ధత సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య ఆరో విడత చర్చలు శనివారం సాఫీగా కొనసాగాయి. సుహృద్భావ వాతావరణంలో చర్చలు జరిగాయని, మార్చి 19న మరోసారి చండీగఢ్‌లో భేటీ కావాలని నిర్ణయించినట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ వెల్లడించారు. 

చండీగఢ్‌లోని మహాత్మా గాంధీ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగిన సమావేశానికి కేంద్ర మంత్రులు శివరాజ్‌ సింగ్‌ చౌహాన్, ప్రహ్లాద్‌ జోషి, పీయూష్‌ గోయల్‌ హాజరుకాగా రైతు సంఘాల ప్రతినిధులు 28 మంది పాల్గొన్నారు.

కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరల అమలుకు నిజంగానే కట్టుబడి ఉంటే ప్రతి ఏడాది ఇందుకు రూ.25వేల కోట్ల నుంచి రూ.30వేల కోట్ల వరకు నిధులు కేటాయించడం పెద్ద సమస్య కాదని రైతు నేతలు తెలిపారు. దీనివల్ల కలిగే ప్రయోజనాలనూ వివరించగా సాధికారికమైన గణాంకాలను కేంద్ర బృందం కోరిందని వెల్లడించారు. వారం రోజుల్లో అందిస్తామని చెప్పినట్లు పేర్కొన్నారు. 

సంయుక్త కిసాన్‌ మోర్చా, కిసాన్‌ మజ్దూర్‌ మోర్చాలకు చెందిన జగ్జిత్‌ సింగ్‌ డల్లేవాల్, స్వరణ్‌ సింగ్, కాకా సింగ్‌ కొట్రా తదితర రైతు నేతలు, ఇద్దరు పంజాబ్‌ రాష్ట్ర మంత్రులు చర్చల్లో పాల్గొన్నారు. ఈ చర్చలకు ముందు రైతు నాయకుడు జగ్జిత్‌ సింగ్‌ డల్లేవాల్​ను కలిసిన శివరాజ్ సింగ్ చౌహాన్, ఆయన యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. 

గతేడాది నవంబర్ 26 నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న డల్లేవాల్ ఈ చర్చల్లో పాల్గొన్నారు.  హామీ ఇచ్చిన మద్దతు ధరను ప్రస్తావిస్తూ “రైతులకు పంటలకు తగిన ధరలు  లభించేలా చూసుకోవడానికి, అది వ్యవసాయ ఆత్మహత్యలను ఆపడానికి ఏకైక మార్గం” అని దల్లెవాల్ స్పష్టం చేశారు. భారతీయ కిసాన్ నౌజవాన్ యూనియన్ అధ్యక్షుడు అభిమన్యు కోహార్, దేశవ్యాప్తంగా రైతులు మద్దతు ధర కంటే తక్కువకు పంటను అమ్మడం ద్వారా బజ్రాలో మాత్రమే రూ. 2,400 కోట్ల నష్టాన్ని చవిచూశారని పేర్కొన్నారు.

 “2023-24లో అన్ని పంటలపై మొత్తం నష్టాలు రూ. 20,000 కోట్లు దాటాయి. ప్రతి సంవత్సరం వ్యవసాయ మంత్రిత్వ శాఖ రూ. 20,000 కోట్లకు పైగా ఉపయోగించని నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖకు అప్పగిస్తుంది. ఈ డబ్బును హామీ ఇచ్చిన మద్దతు ధరను  నిర్ధారించడానికి ఉపయోగించవచ్చు,” అని రైతు నాయకుడు సర్వాన్ సింగ్ పాంధర్ సూచించారు. పంజాబ్ మంత్రులు హర్పాల్ చీమా, గుర్మీత్ సింగ్ ఖుడియన్, లాల్ చంద్ కటారుచక్ కూడా ఈ చర్చలలో పాల్గొన్నారు.