పంజాబ్ లో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి!

పంజాబ్ లో లేని శాఖకు 20 నెలలుగా మంత్రి!

పంజాబ్‌లో ఉనికిలో లేని ఓ శాఖకు ఆప్ పార్టీకి చెందిన ఓ మంత్రి బాధ్యతలు నిర్వహించారు. ఈ విషయాన్ని దాదాపు 20 నెలల తర్వాత పంజాబ్‌ ప్రభుత్వం గుర్తించింది. దానిని సవరించేందుకు ఇచ్చిన ఒక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా ఈ విషయం వెలుగు చూసింది. దీనిపై బీజేపీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించింది.

2022 మార్చి నెలలో పంజాబ్‌లో భగవంత్‌ మాన్‌ నేతృత్వంలో ఆప్‌ ప్రభుత్వం ఏర్పడింది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా 2023 మే నెలలో కుల్దీప్‌సింగ్ ధలివాల్‌కు రెండు శాఖలు కేటాయించింది. ఆయనకు ఎన్‌ఆర్‌ఐ వ్యవహారాలు, పరిపాలన సంస్కరణలు విభాగం బాధ్యతలు అప్పగించింది.

2024లో చివర్లో మరోసారి పునర్వ్యవస్థీకరణ చేసింది. ఇందుకోసం ప్రభుత్వం ఓ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. తాజాగా దానిని సవరించింది. కుల్దీప్‌సింగ్‌కు కేటాయించిన పరిపాలన సంస్కరణలు అనే శాఖ ఉనికిలో లేకపోవడం వల్ల సెప్టెంబర్‌లో ఇచ్చిన నోటిఫికేషన్‌లో మార్పులు చేస్తున్నట్లు అందులో పేర్కొంది.

ఈ విషయంపై బీజేపీ విమర్శలు గుప్పించింది. “పంజాబ్‌లో పాలనను ఆప్‌ ఒక జోక్‌గా మార్చింది. ఉనికిలో లేని శాఖకు 20 నెలలుగా ఆ మంత్రి బాధ్యతలు నిర్వర్తించారు. అలాంటి ఒక శాఖను తన మంత్రి నిర్వహిస్తున్నారనే విషయం సీఎంకు కూడా తెలియదంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోండి” అని  బీజేపీ ప్రతినిధి ప్రదీప్ భండారి ధ్వజమెత్తారు.