మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య

మేడిగడ్డ కుంగుబాటుపై కేసు వేసిన వ్యక్తి దారుణ హత్య
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుకు బీఆర్ఎస్ ప్రభుత్వమే కారణమంటూ భూపాలపల్లికి చెందిన రాజలింగమూర్తి (40) అనే వ్యక్తి హైకోర్టులో కేసు కూడా వేశారు. ఈ పిటిషన్‌పై ప్రస్తుతం హైకోర్టులో కేసు నడుస్తుండగా, రాజలింగమూర్తి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తు తెలియని దండగులు ఆయన్ను కిరాతకంగా హత్య చేశారు.  మృతునికి భార్య సరళ, కుమార్తె, కుమారుడు ఉన్నారు.
 
బుధవారం రాత్రి 7.15 గంటల సమయంలో కత్తులు, గొడ్డళ్లతో నరికి చంపారు. రాజలింగమూర్తి సోదరుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి బుధవారం తన స్వగ్రామం జంగేడు శివారు పక్కీరుగడ్డకు వెళ్లారు. వేడుక అనంతరం బైక్ వాహనంపై భూపాలపల్లికి తిరిగి వస్తుండగా తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఎదురుగా ఉన్న రోడ్డును దాటుతున్న క్రమంలో ఓ నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు మంకీ క్యాపులు ధరించి రాజలింగమూర్తిని చుట్టుముట్టారు. 
 
ఒక్కసారిగా కత్తులు, గొడ్డళ్లతో అతడిపై దాడికి తెగబడ్డారు. ఈ దాడిలో రాజలింగం తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికుడు అతడిని ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కాగా, రాజలింగమూర్తి గతంలో బీఆర్ఎస్ పార్టీలో పని చేశారు. అతని బార్య నాగవెళ్లి సరళ భూపాలపల్లిలోని 15వ వార్డు నుంచి బీఆర్ఎస్ తరఫున కౌన్సిలర్‌గా గెలుపొందారు. 
 
కొద్ది నెలల తర్వాత నాగవెళ్లి సరళను బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాజలింగమూర్తి గత రెండు దశాబ్దాలుగా వరంగల్‌కు చెందిన ఓ ప్రముఖ న్యాయవాది ద్వారా భూపాలపల్లి ప్రాంతంలోని భూ సమస్యలను పరిష్కరించేవారు. భూతగాదాల విషయంలో రాజలింగమూర్తిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు కూడా నమోదయ్యాయి.
 
మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై రాజలింగమూర్తి వేసిన నేపథ్యంలో మేడిగడ్డ కుంగుబాటు అంశంపై వివరణ ఇవ్వాలని మాజీ ముఖ్యమంత్రి కెసిఆర్, మాజీ మంత్రులు హరీశఃరావు, అప్పటి నీటి పారుదల శాఖ కార్యదర్శి రజత్ కుమార్, అప్పటి సిఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు హరిరామ్, శ్రీధర్, మేఘా నిర్మాణ సంస్థ అధినేత మేఘా కృష్ణారెడ్డి, ఎల్ అండ్ టి సంస్థలకు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులు జారీ చేసింది.
 
సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల తవ్వకాలతో సమీపంలో పర్యావరణం దెబ్బతింటోందని సింగరేణిపై ఆయన నేషనల్‌ గ్రీన్‌ ట్రైబ్యునల్‌లోనూ ఫిర్యాదు చేశారు. గతంలో ఉన్న భూ తగదాలే హత్యకు కారణమై ఉండొచ్చునని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు.