ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలు కొట్టిపారేసిన సిబిఎస్‌ఇ

ప్రశ్నపత్రాల లీకేజ్ ఆరోపణలు కొట్టిపారేసిన సిబిఎస్‌ఇ

ప్రస్తుతం జరుగుతున్న 10, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి ప్రశ్నా పత్రాలు లీక్‌ అయ్యాయని వచ్చిన ఆరోపణల్ని సిబిఎస్‌ఇ (సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌) ఖండించింది. ఈ ఆరోపణలు నిరాధారమైనవి సిబిఎస్‌ఇ తెలిపింది. ఈ మేరకు సోమవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. 

యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌, ఎక్స్‌తోపాటు ఇతర సామాజిక మాధ్యమాలు ఈ ఏడాది (2025) పరీక్షలకు సంబంధించి ప్రశ్నాపత్రాలు లీక్‌ అయ్యాయని పుకార్లు వ్యాప్తి చేస్తున్నాయని బోర్డు దృష్టికి వచ్చింది. ఇవి నిరాధారమైనవి. విద్యార్థులను, వారి తల్లిదండ్రులను భయాందోళనలకు గురిచేసేందుకు చేస్తున్న ప్రయత్నమని సిబిఎస్‌ఇ విడదల చేసిన ప్రకటన పేర్కొంది. 

పరీక్షా ప్రక్రియను సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు కఠిన చర్యలు తీసుకున్నట్లు బోర్డు హామీ ఇచ్చింది. తప్పుడు సమాచారం ఇచ్చినవారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించింది. సిబిఎస్‌ఇ వెబ్‌సైట్‌ ధృవీకరించిన పబ్లిక్‌ ఛానెల్‌లో అందుబాటులో ఉన్న సమాచారాలపై మాత్రమే ఆధారపడాలని విద్యార్థులను, తల్లిదండ్రులను, పాఠశాలలను బోర్డు కోరింది. 

ధృవీకరించని వార్తలను నమ్మకుండా తల్లిదండ్రులే పిల్లలకు మార్గనిర్దేశనం చేయాలని సిబిఎస్‌ఇ సూచించింది. కాగా, శనివారం నుంచి సిబిఎస్‌ఇ బోర్డు ఎగ్జామ్స్‌ జరుగుతున్నాయి. 7,800 పరీక్షా కేంద్రాల్లో 42 లక్షల మంది పరీక్షల్ని రాస్తున్నట్లు బోర్డు అధికారులు తెలిపారు.  పదో తరగతి విద్యార్థులు 84 సబ్జెక్టుల్లో 24.12 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు.

ఇక 12వ తరగతి విద్యార్థులు 120 సబ్జెక్టుల్లో 17.88 లక్షల మందికి పైగా విద్యార్థులు ఎగ్జామ్స్‌ రాస్తున్నారు. ఈ నెల 15న మొదలైన ఈ పరీక్షలు ఏప్రిల్ 4, 2025 వరకు కొనసాగనున్నాయి.  కాగా, ఓ ఎడ్‌టెక్ కంపెనీ ఇటీవల ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో ఫిబ్రవరి 16 నుంచి ప్రారంభమయ్యే తన 4 రోజుల క్లాసులకు హాజరు కావాలని విద్యార్థులను కోరింది. ఆ క్రమంలో  సిబిఎస్‌ఇ బోర్డు పరీక్ష 2025లో వచ్చే ప్రశ్నల గురించి చర్చిస్తానని ప్రకటించారు. 

ఈ క్రమంలో సిబిఎస్‌ఇ ప్రశ్నాపత్రాన్ని సెట్ చేసిన వ్యక్తులను తాను తెలుసుకున్నానని, బోర్డు పత్రంలో తన ప్రశ్నలు ఉంటాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశాడు. సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చిన ఈ వీడియో కొన్ని గంటల్లోనే వైరల్ అయ్యింది. దీంతో సిబిఎస్‌ఇ బోర్డు తప్పుడు సమాచారం, పరీక్ష సమగ్రతను ప్రస్తావిస్తూ ఒక సర్క్యూలర్ జారీ చేసింది.