జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి

జౌళి ఎగుమతుల్ని రూ.9 లక్షల కోట్లకు పెంచాలి
 
జౌళి ఉత్పత్తుల ఎగుమతుల్ని పెంచడమే లక్ష్యంగా కేంద్రం పలు చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఈ రంగంలో వార్షిక ఎగుమతులను 2030 కన్నా ముందే రూ.9 లక్షల కోట్ల లక్ష్యాన్ని సాధిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఫిబ్రవరి 14 నుంచి 17వరకు జరుగుతున్న భారత్‌ టెక్స్‌ కార్యక్రమానికి ఆయన ఆదివారం హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ టెక్స్‌టైల్‌ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని కోరారు. ప్రపంచంలోనే ఆరో అతిపెద్ద వస్త్ర ఎగుమతిదారుగా ఉన్న భారత గతేడాది 7శాతం వృద్ధి నమోదు చేసిందని చెప్పారు. ప్రస్తుతం రూ.3లక్షల కోట్లుగా వార్షిక ఎగుమతుల్ని 2030 నాటికి రూ.9 లక్షల కోట్లకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. 
 
భారత్‌ టెక్స్‌ 2025లో 120కి పైగా దేశాలు పాల్గొంటున్నాయని పేర్కొన్నారు. భారత్‌ హై-గ్రేడ్‌ కార్బన్‌ ఫైబర్‌ తయారీ దిశలో ముందుకు సాగుతోందని, వస్త్ర రంగంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులను తయారు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ప్రధాని తెలిపారు. సాంకేతిక వస్త్ర రంగంపై దృష్టి సారించామని చెప్పారు.
 
టెక్స్‌టైల్‌ రంగానికి బ్యాంకులు సహకారం అందించాలని, తద్వారా ఉపాధి పెంచేందుకు సహకరించాలని ప్రధాని కోరారు. మరోవైపు, ప్రధాన పత్తి రకాల ఉత్పాదకతను పెంచేందుకు కేంద్రం రూ.500 కోట్లతో కాటన్‌ మిషన్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాకుడా, 2025-26 బడ్జెట్‌లో జౌళి మంత్రిత్వ శాఖకు కేంద్ర బడ్జెట్‌లో రూ.5,272 కోట్లు కేటాయించింది.