న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం

న్యూ ఇండియా బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం

ముంబైలోని న్యూ ఇండియా కోఆపరేటివ్‌ బ్యాంకును రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ( ఆర్‌బిఐ ) నిషేధించింది. ఈ సహకార బ్యాంకు నుంచి రుణాలు పంపిణీ చేయకుండా ఆపింది. మరోవైపు ఖాతాదారులు డబ్బు విత్‌డ్రా చేసుకోకుండా ఆంక్షలు పెట్టి విచారణకు ఆదేశించింది. ఈ బ్యాంకులో రూ. 122 కోట్ల కుంభకోణం జరిగిందని తేలింది. 

బ్యాంక్‌ జనరల్‌ మేనేజర్‌ హితేష్‌ మెహతాపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి, ముంబయి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బ్యాంక్‌ లో జనరల్‌ మేనేజర్‌ హితేష్‌ మెహతా అకౌంట్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అకౌంట్స్‌ తనిఖీ చేయగా రూ.122 కోట్ల మేర కుంభకోణం జరిగిందని గుర్తించిన యాక్టింగ్‌ సీఈఓ దేవర్షి ఘోష్‌ ఫిర్యాదు చేయటంతో స్కాం గుట్టు వెలుగులోకి వచ్చింది. 

ప్రభాదేవి, గోరేగావ్‌ శాఖల రిజర్వ్‌ నిధులను తారుమారు చేశాడని ఆరోపణలున్నాయి. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన ముంబయి పోలీసు ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తున్నది. మార్చి 2024 నాటికి, ఈ బ్యాంకులో రూ.2436 కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ పథకం కింద డిపాజిటర్లకు రూ.5 లక్షల వరకు బీమా క్లెయిమ్‌ చేసుకునే హక్కు ఉంది. డిపాజిటర్లు తమ క్లెయిమ్‌లను బ్యాంకులో జమ చేయాలని కోరారు.

ఈ బ్యాంకు ద్రవ్యతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర బ్యాంకు చర్య తీసుకుంది. ఈ బ్యాంకు లిక్విడిటీ స్థితి గురించి ఆందోళనలు ఉన్నాయి. దీని కారణంగా పొదుపు, కరెంట్‌ లేదా ఏదైనా ఇతర డిపాజిట్‌ ఖాతా నుంచి డబ్బును ఉపసంహరించుకోవడంపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. డిపాజిటర్ల ప్రయోజనాలను కాపాడేందుకు ఈ చర్యలు అమలు చేసినట్టు ఆర్బీఐ తెలిపింది. 

ముంబయిలోని అంధేరీ, బాంద్రా, బోరివలి, చెంబూర్‌, ఘాట్కోపర్‌, గిర్గావ్‌, గోరేగావ్‌, నారిమన్‌ పాయింట్‌, కండివలి, మలాడ్‌, ములుండ్‌, శాంతాక్రూజ్‌ , వెర్సోవాలలో నూతన బ్రాంచీలు ఏర్పాటు చేశారు. వీటితో పాటు నవీ ముంబయి, థానే, పాలెర్‌, పూణే, సూరత్‌లలో కూడా ఉంది. అయితే బ్యాంకులో స్కాం జరిగిన విషయం తెలియగానే తాము పైసాపైసా కూడబెట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయా..రావా..? అని ఖాతాదారుల్లో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.