అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు

అధికారులు ఏసీ గదుల నుంచి బైటకు రావట్లేదు
ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు ఏసీ గదుల నుంచి బయటకు రావడం మానేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు.  మాజీ ఐఏఎస్‌ అధికారి గోపాలకృష్ణనాయుడు రచించిన ‘లైఫ్‌ ఆఫ్‌ ఎ కర్మయోగి’ పుస్తకాన్ని ఆవిష్కరిస్తూ అధికారులు ప్రజల వద్దకు వెళ్లినప్పుడే ప్రజా సమస్యలు అర్థమవుతాయని, ఆఫీసుల్లో కూర్చుంటే ప్రయోజనం ఉండదని స్పష్టం చేశారు.

“గతంలో ఐఏఎస్ అధికారులు నిత్యం ప్రజల్లో ఉండేవారు. ఆ కారణంగానే రాజకీయ నాయకుల కంటే అధికారులనే ప్రజలు ఎక్కువగా గుర్తుంచుకునే వారు. ముఖ్యంగా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో పర్యటించడం వల్ల సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. కానీ కొందరు కలెక్టర్లు ఏసీ రూములను వదిలి బయటకు వెళ్లడం లేదు. కలెక్టర్లు, ఎస్పీలకు జిల్లా స్థాయిలో గడించే అనుభవమే కీలకమవుతుంది” అని చెప్పారు.

గతంలో అధికారుల రాజకీయ నాయకులు ఏదైనా విషయాన్ని ప్రస్తావించినప్పుడు అందులోని లోటుపాట్లను, దాని వల్ల వచ్చే నష్టాన్ని చెప్పేవారని సీఎం రేవంత్‌ గుర్తు చేశారు. చట్టవిరుద్ధంగా వెళితే భవిష్యత్తులో తలెత్తే సమస్యను వివరించేవారని, నాయకులను అప్రమత్తం చేస్తూ జరగబోయే పరిణామాలను గుర్తుచేసేవారని తెలిపారు. 

 
కానీ, ఈ రోజుల్లో అలా చెప్పడం తగ్గిపోయిందని పేర్కొంటూ ‘‘ఇందుకు కారణమేంటో నాకు తెలియదు. కానీ, పొలిటికల్‌ ఎగ్జిక్యూటివ్‌ను సంతోష పెట్టాలనో లేక తనకు తాను సంతోషపడాలనో.. రాజకీయ నాయకులు తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్నీ అమలు చేస్తున్నారని అనుకుంటున్నా’’ అని రేవంత్‌ విచారం వ్యక్తం చేశారు.
 
 ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, వారి చదువు, అనుభవం వేర్వేరు కావచ్చునని, ఏమీ చదువుకోని వారికి విద్యాశాఖను కూడా ఇవ్వవచ్చని, పొలిటికల్‌ ఎగ్జిక్యూటివ్‌ జాబ్‌కు, వారి చదువుకు ఏమాత్రం సంబంధం ఉండదని పేర్కొన్నారు. అందుకే తమకు అవగాహన కల్పించడానికి సెక్రటేరియట్‌ బిజినెస్‌ రూల్స్‌ ప్రకారం అధికారులు అవసరమవుతారని తెలిపారు. వారు ఏ ఫైలు వచ్చినా అందులోని తప్పొప్పులను తమకు వివరించాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

నిబద్ధత కలిగిన అధికారులకు తప్పకుండా గుర్తింపు ఉంటుందని సీఎం పేర్కొన్నారు. గోపాలకృష్ణనాయుడు తన ఆరు దశాబ్దాల అనుభవాన్ని గ్రంథ రూపంలో నిక్షిప్తం చేయడం పెద్ద టాస్క్‌ అని ప్రశంసించారు.  “తొలి ప్రధానమంత్రి నెహ్రూ కాలం నుంచి నేటి ప్రధాని మోదీ వరకు అనుభవం కలిగిన గోపాలకృష్ణ.. క్లోజ్డ్ ఎకానమీ నుంచి ఓపెన్ ఎకానమీ వరకు దేశంలో మార్పులకు ప్రత్యక్ష సాక్షి. భవిష్యత్తును కూడా వారు విజువలైజ్ చేయగలుగుతున్నారు” అని వివరించారు.